PM Narendra Modi: హిమాచల్‌ ప్రదేశ్‌ లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే

హిమాచల్‌ ప్రదేశ్‌ లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే

Narendra Modi : హిమాచల్ ప్రదేశ్‌ లో వరదలు, కొండచరియలు విరిగిపడి భారీ ఆస్తి, ప్రాణనష్టం జరగడంతో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం నాడు ఆ రాష్ట్రంలో పర్యటించారు. పరిస్థితిని అంచనా వేసేందుకు మండి, కుల్లు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. దీనికి ముందు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకు… గగల్ విమానాశ్రయం వద్ద గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి సాదర స్వాగతం పలికారు. విపక్ష నేత జైరామ్ ఠాకూర్, రాష్ట్ర బీజేపీ చీఫ్ రాజీవ్ దింపాల్, పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. వర్షాకాలం సీజన్‌లో చోటుచేసుకున్న పెను విపత్తుపై ముఖ్యమంత్రి, అధికారులు ప్రధానికి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని బీజేపీ నేతలు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.

PM Narendra Modi – హిమాచల్ కు రూ.1500 కోట్ల తక్షణ సాయం !

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన హిమాచల్‌ ప్రదేశ్‌ కు తక్షణ సాయం కింద ప్రధాని మోదీ (Narendra Modi) రూ.1500 కోట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పరిస్థితులను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. ఈ క్రమంలోనే మృతుల బంధువులకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే అనంతరం ప్రధాని మోదీ కాంగ్రాలో ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు, గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా తదితరులతో సమావేశమయ్యారు. సహాయక, పునరావాస చర్యలను సమీక్షించారు. నష్టాన్ని అంచనా వేశారు. ఈ సందర్భంగా వరద బాధితులను పరామర్శించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం వెన్నంటే ఉంటామని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, సైన్యం, రాష్ట్ర యంత్రాంగం సేవలను ప్రధాని మోదీ (Narendra Modi) ప్రశంసించారు. ఇదిలా ఉండగా.. వరద నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌ లో పర్యటించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందాల నివేదికలతో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన విజ్ఞప్తుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మోదీ తెలిపారు. అనంతరం పంజాబ్‌లో పర్యటించనున్నారు.

హిమాచల్ కు రూ.4,122 కోట్ల నష్టం ?

జూన్ 20 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకూ క్లౌడ్ బరస్ట్‌లు, మెరుపు వరదలు, భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో రూ.4,122 కోట్ల మేరకు నష్టం జరిగిందని… వర్షాలు, రోడ్డుప్రమాదాల్లో 370 మంది వరకూ మృతి చెందారని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. మృతుల్లో 43 మంది కొండచరియలు విరిగిపడి, 17 మంది క్లౌడ్‌‍బరస్ట్‌లు, తొమ్మిది మంది మెరుపు వరదల్లో ప్రాణాలు కోల్పోగా.. 205 మంది వర్షాలకు సంబంధించిన ఘటనల్లో మృతి చెందారు. రాష్ట్రంలో 4 నేషనల్ హైవేస్‌ సహా 619 రోడ్లు మూసివేయగా, 1,748 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 461 వాటర్ సప్లై పథకాలకు అంతరాయం కలిగింది. ఈ సీజన్‌లో 6,344 ఇళ్లు, 461 దుకాణాలు, ఫ్యాక్టరీలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నాయి.

Also Read : Maratha Reservation: మరాఠాలకు మోదీ బర్త్ డే గిఫ్ట్

Leave A Reply

Your Email Id will not be published!