తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలలో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ టీటీడీ పటిష్టమైన మూడంచెల భద్రతా వ్యవస్థను నిరంతరాయంగా అమలు చేస్తోందని తెలిపింది. ప్రతి షిఫ్టులో వందలాది మంది భద్రతా సిబ్బంది చెకింగ్, స్కానింగ్ విధుల్లో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొంది. ఏదైనా కారణాల వల్ల ఒక భద్రత పాయింట్ వద్ద గుర్తించబడని మొబైల్ ఫోన్ వంటి నిషేధిత వస్తువులు తదుపరి అంచెలలో గుర్తించి, నిర్దేశిత డిపాజిట్ విధానాన్ని అమలు చేయడం జరుగుతోందని వెల్లడించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని గుర్తించి, వారిపై అవసరమైన శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో తిరుమలలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీటీడీ కుండ బద్దలు కొట్టింది.ఒక భక్తుడు సెల్‌ఫోన్‌తో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి, అక్కడి కంపార్ట్‌మెంట్ల దృశ్యాలను చిత్రీకరించి పోస్ట్ చేసినట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. అయితే, వాస్తవానికి సదరు భక్తుడు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు మొబైల్ ఫోన్‌తో వచ్చినప్పటికీ, వివిధ దశల్లో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో భాగంగా డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద అతడిని గుర్తించి, భద్రతా సిబ్బంది మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తిరుమలలో అమలవుతున్న మూడంచెల భద్రతా వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తోందనడానికి నిదర్శనం అని పేర్కొంది.
తిరుమలలో భద్రతా వైఫల్యం జరిగిందంటూ నిరాధార ప్రచారం చేయడం, వాస్తవాలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయడం సరికాదని టీటీడీ పేర్కొంది. భక్తులు అసత్య ప్రచారాలను నమ్మకుండా, అధికారిక సమాచారం పైనే విశ్వాసం ఉంచాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
