హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ స్కూల్స్ కు సంబంధించి టీచర్లు, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని తక్షణమే మూసి వేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు బాంబు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. విద్య, వైద్యం అనేది ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని కేవలం ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నం చేయడం దారుణమని విద్యార్థి , ఉపాధ్యాయ, పేరెంట్స్ కమిటీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎం నిర్ణయం కేవలం బడా బాబులకు, విద్య పేరుతో మోసం చేస్తున్న కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేలా ఉందంటూ భగ్గుమంటున్నారు. తాజాగా తెలంగాణ సేవ్ ఎడ్యూకేషన్ కమిటీ (టీఎస్పీసీ) సంచలన ప్రకటన చేసింది. తక్షణమే సీఎం తన నిర్ణయాన్ని మార్చు కోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై సీఎం తన ప్రకటనను బేషరతుగా ఉపసంహరించు కోవాలని టీఎస్పీసీ డిమాండ్ చేసింది. 23,000 పాఠశాలలను మూసి వేయడం వల్ల పిల్లలకు నష్టం జరుగుతుందని , బడి మానేసే వారి సంఖ్య పెరుగుతుందని కమిటీ హెచ్చరించింది. అలాగే, రాష్ట్ర బడ్జెట్లో 20 శాతాన్ని ప్రభుత్వ విద్యకు కేటాయించాలని, శాశ్వత నియామకాలు చేపట్టాలని, పాఠశాలల్లో వసతులు కల్పించాలని , ప్రైవేట్ విద్యను నియంత్రించాలని కమిటీ డిమాండ్ చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి గ్రామంలోనూ ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలి అని కమిటీ ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు.
జూన్ 20 నుండి జూలై 15 వరకు ఒక ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయి రౌండ్-టేబుల్ సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తులు, వైస్-ఛాన్సలర్లు , ప్రొఫెసర్లు విద్యావేత్తలతో సహా ప్రముఖ వ్యక్తుల నుండి 100కు పైగా సంతకాలతో ఒక బహిరంగ లేఖను కూడా తాము విడుదల చేస్తామన్నారు.
