న్యూఢిల్లీ : వాణిజ్య కార్యకలాపాలు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రారంభం అయ్యాయి. ఈ విషయాన్ని ప్రకటించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్ మోహన్ నాయుడు. ఈ ఎయిర్ పోర్టు జాతీయ రాజధాని ప్రాంతానికి ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఆవిర్భవిస్తుందని భావిస్తున్నారు. లక్నో నుండి మొదటి విమానం ఉత్తర ప్రదేశ్‌లోని జేవర్‌లో ఉన్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. మొదటి షెడ్యూల్డ్ ఇండిగో విమానం ( 6E-2278 ) లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈ విమానాశ్రయానికి చేరుకుంది. జేవర్‌లో దిగిన తర్వాత, ఈ విమానం బెంగళూరుకు బయలుదేరింది, అక్కడ ఉదయం 11:05 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా విమానాశ్రయ నిర్మాణం కోసం తమ పూర్వీకుల భూములను స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చిన జేవార్ ప్రాంతానికి చెందిన 20 మంది మహిళలతో సహా సుమారు 170 మంది రైతులు, ప్రారంభ విమానంలో లక్నోకు ప్రయాణించారు. అక్కడ వారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. ఈ రైతు బృందానికి జేవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు , విమానాశ్రయ స్థాపనకు రైతులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ విమానాశ్రయం ఆ ప్రాంతంలో అనుసంధానాన్ని, ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ విమానాశ్రయం ఎన్‌సిఆర్‌కు ఒక ప్రధాన అంతర్జాతీయ ప్రవేశ ద్వారంగా పని చేస్తుంది.
