చిత్తూరు జిల్లా : పేదరిక నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యంతో కూడిన శాశ్వత పరిష్కారంగా పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్షిప్ ఫర్ ప్రాస్పెరిటీ) కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదల జీవితాలు బంగారు మయం కావాలనే ఉద్దేశ్యంతోనే పీ4 ద్వారా బంగారు కుటుంబాలు-మార్గదర్శుల విధానాన్ని అవలంభిస్తున్నామని చెప్పారు. కుప్పం పర్యటనలో భాగంగా పీ4 మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బంగారు కుటుంబాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మెగా, అదానీ, టీవీఎస్ మోటార్ సైకిల్స్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
బంగారు కుటుంబాలు కేవలం ప్రభుత్వ సహాయంపై ఆధారపడే పరిస్థితిలో కాకుండా, ఆర్థికంగా ఎదిగి ఇతరులకు సైతం చేయూతనిచ్చే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఇందుకోసం బంగారు మిత్రల సహకారంతో ప్రతి కుటుంబం స్థితిగతులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పీ4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని చంద్రబాబు తెలిపారు. దీనిని ఎంబీకే–10:20 నమూనాగా అమలు చేస్తున్నామని, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న 10 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్న 20 శాతం కుటుంబాలకు అండగా నిలవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు.
