116 ఏళ్ల వృద్దురాలు న‌వ‌నీత‌మ్మ‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం

చైర్మ‌న్ నాయుడు, ఈవో ర‌విచంద్ర‌కు ధ‌న్య‌వాదాలు

తిరుమల : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది 116 ఏళ్ల వృద్దురాలు న‌వ‌నీత‌మ్మ‌. ఆమె త‌న కుటుంబంతో క‌లిసి శ‌నివారం శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం 3,000 కు పైగా ఉన్న మెట్ల‌ను ఎక్కింది. 50 ఏళ్ల‌కే ముస‌లి వాళ్లు అయి పోతున్న ఈ త‌రుణంలో త‌ను శ‌తాధిక వృద్దురాలు అయిన‌ప్ప‌టికీ శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పై ఉన్న భ‌క్తి త‌న‌ను న‌డిపించేలా, మెట్లు ఎక్కేలా చేసింది. త‌ను న‌డిచి వ‌స్తున్న దృశ్యాల‌ను రికార్డ్ చేసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతో పెద్ద ఎత్తున వైర‌ల్ అయ్యింది. దేశ వ్యాప్తంగా త‌న‌కు ప్ర‌శంస‌లు కురిశాయి. దీనిని గ‌మ‌నించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు న‌వనీత‌మ్మ‌కు , ఆమె కుటుంబానికి వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు జూలై 6న సోమ‌వారం న‌వ‌నీత‌మ్మ‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించారు.

నవనీతమ్మను పట్టు వస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ ఆమె ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. దర్శనం అనంతరం, రంగనాయకుల మండపంలో TTD ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముద్దాడ‌ రవిచంద్ర ఆమెకు వేద ఆశీర్వచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మనవడు దీక్షపతి మాట్లాడుతూ, తన అమ్మమ్మ చిరకాల కోరిక అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని సాకారం చేసినందుకు టీటీడీకి, చైర్మ‌న్ నాయుడుకు ఈవోకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆ వృద్ధ భక్తురాలిని త్వరగా గుర్తించడంలో సహాయపడిన సోషల్ మీడియా వినియోగదారులు , TTD విజిలెన్స్ అధికారులకు కూడా నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఒక భక్తురాలి చిరకాల కోరికను నెరవేర్చడం ఇందులో పాలుపంచుకున్న వారందరికీ ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!