హైదరాబాద్ : పర్యాటక రంగంలో హైదరాబాద్ ను కేరాఫ్ గా మార్చేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పర్యాటక అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష చేపట్టారు. పర్యావరణ పర్యాటకం, వారసత్వ ప్రదేశాలు, వికారాబాద్ అభివృద్ధి, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌పై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సోమవారం ఎంఎస్ఆర్ హెచ్ డి బోధి పెవిలియన్‌లో పర్యాటక రంగ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, పర్యాటక శాఖ కార్యదర్శి వాణి ప్రసాద్, పర్యాటక శాఖ ఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా, తారామతి బరాదరి , దుర్గం చెరువు వంటి కీలక పర్యాటక ప్రాంతాలను పూర్తి స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
అలాగే మంజీర, దిల్కుషా అతిథి గృహాలను ఆధునీకరించాలని సూచించారు. ‘టూరిజం హబ్ డెవలప్‌మెంట్’ పథకం కింద వికారాబాద్‌ను ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలని నిర్దేశించారు. యాదాద్రి తరహాలో వికారాబాద్‌లోని వీరభద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, ఇందుకోసం ప్రత్యేక ఆలయ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పర్యావరణ పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తూ, హెచ్ ఎండీఏ పరిధిలోని అటవీ భూములను అటవీ శాఖ సమన్వయంతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గుర్రంగుడ ఎకో పార్క్ తరహాలో నగరవ్యాప్తంగా ఎకో పార్కులను ఏర్పాటు చేయడం, ప్రతిపాదిత ‘ఫ్యూచర్ సిటీ’లో అటవీ ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం, పట్టణ అటవీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం వంటి చర్యలను సూచించారు.
పట్టణ అటవీ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రతిపాదించారు. పురానా పుల్ , ఇతర వారసత్వ వంతెనలను పర్యాటక ఆకర్షణలుగా అభివృద్ధి చేయాలని, సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన నొక్కి చెప్పారు.
