అమరావతి : రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రం నుంచి రియల్ టైమ్‌లోనే ప్రజల సమస్యలు, ఇబ్బందులపై రెస్పాన్స్ అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేగంగా స్పందించ గలిగితేనే పౌరులకు మెరుగైన సేవల్ని అందించ గలుగుతామని ఆయన స్పష్టం చేశారు. సీఎస్ ఆధ్వర్యంలో మల్టీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ సమావేశం జరగాలని అన్నారు. విశాఖ సముద్రం తీరంలో బోటు మునిగి మత్స్యకారులు గల్లంతైన ఘటనలో తక్షణ స్పందనగా ఏఏ విభాగాలు ఎలా స్పందించాయన్నదే కీలకమని అన్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం 24 గంటలూ ప్రజలకు సేవలందించేలా చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించారు. 5 రోజుల జిల్లాల పర్యటన అనంతరం సోమవారం అమరావతికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పురపాలక, పంచాయితీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా అందిస్తున్న ప్రభుత్వ సేవలపై సమావేశంలో చర్చించారు.
దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏఐ మెథడాలజీ ద్వారా చిత్తూరు జిల్లాలో సంతృప్తి స్థాయి నమోదు చేస్తున్నాం. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నియోజకవర్గ స్థాయిలో లాస్ట్ మైల్ గవర్నెన్స్ ప్రజలకు అందాలి. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజాపాలనలో పొలిటికల్ మేనేజ్మెంట్-బ్యూరోక్రటిక్ యాక్షన్ సమపాళ్లలో ఉండాలని దిశా నిర్దేశం చేశారు సీఎం. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ కేటగిరీలు, శాఖలకు చెందిన పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు భాద్యత తీసుకోవాలని అన్నారు.
