విజయవాడ : అవకాశాలు కల్పించినట్లయితే ఆదివాసీ బిడ్డలు అద్బుతాలు సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆదివారం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ప్రకృతిని ఆరాధిస్తూ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ గిరిజనులు జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. అద్భుతాలు చేయగల సామర్ధ్యం ఆదివాసీలకు ఉందన్నారు. ఓ సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్ము ఒడిశాలో మంత్రిగా, గవర్నర్ గా పనిచేస్తూ నేడు రాష్ట్రపతిగా అత్యున్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. మన సంకల్పమే మనకు ఆత్మవిశ్వాసం కల్పించి అందలాలు ఎక్కిస్తుందని పేర్కొన్నారు సీఎం. ఓ సాధారణ మహిళగా ద్రౌపదీ ముర్ము అనే నేను అని రాష్ట్రపతిగా ఎదిగి సాధించి చూపించారని ప్రశంసించారు.
అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, ప్రధాని మోదీ ఇలా ప్రతీ ఒక్కరూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వారేనని అన్నారు. సంకల్పం ఒక్కటే మార్పు తెస్తుందని అంతా గుర్తు చేసుకోవాలని అన్నారు.
ఆ సంకల్పమే పౌరులు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా అంతా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేను, నా దేశం, నా రాష్ట్రం, నా ఊరు నా కుటుంబం అనే భావనతో సంకల్పం చేయాలని అన్నారు సీఎం. స్వాంతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజానికి, దేశానికి నేను ఏమివ్వాలని లక్ష్యంతో పనిచేద్దాం అని పేర్కొన్నారు. దేశం కోసం పనిచేయటం అంటే బోర్డర్ కు వెళ్లి యుద్ధం చేయాల్సిన అవసరమే లేదన్నారు. గిరిజన రైతు తన పంటను మెరుగ్గా పండించి దేశం కోసం కృషి చేశారని చెప్పారు. స్వయం ఉపాధితో సంపాదిస్తున్న మహిళ దేశం కోసం పనిచేసినట్టేనని అన్నారు సీఎం. ఓ విద్యార్థి, ఓ ఉపాధ్యాయుడు, ఓ ఉద్యోగి, ఓ వ్యాపారి, ఓ కూలి ఇలా ఎవరైనా నిష్టతో అత్యుత్తమ సామర్ధ్యంతో పనిచేస్తే చాలు అన్నారు.