న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కీలక చర్చలు జరిపారు. ప్రధానంగా ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చించారు. ప్రత్యేకించి ఏఐసీసీ అధ్యక్షుడు ,రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేతో రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు శివకుమార్. ఇదిలా ఉండగా ఇవాళ బెంగళూరుకు బయలుదేరే ముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో మాట్లాడారు . తనతో ప్రధానంగా మంత్రివర్గంలో చిన్నపాటి మార్పులు , కొత్తగా చేరిన మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చలు జరిపారు. అసంతృప్తితో ఉన్న శాసనసభ్యులకు అవకాశం కల్పించేందుకు మంత్రివర్గ శాఖల కేటాయింపులో చిన్నపాటి మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం.
దీనివల్ల కొత్తగా చేరిన మంత్రులలో ఒకటి లేదా రెండు శాఖలను మార్చ వచ్చని లేదా వారిని తొలగించవచ్చని సమాచారం. తాము ఒక మహిళా సభ్యురాలిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ సందర్బంగా సీఎం డీకే శివకుమార్. కచ్చితంగా తీసుకుంటామని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. దీనికి ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదన్నారు సీఎం. మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు డీకే శివకుమార్. కర్ణాటక శాసనమండలి చైర్మన్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన బీజేపీ శాసనసభ్యుడు బసవరాజ్ హొరట్టి రాజీనామా తర్వాత జరిగిన పరిణామాలను ఖర్గేకు వివరించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నెల ప్రారంభంలో కర్ణాటకలో భారీ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో 19 మంది మంత్రులు చేరారు; దీంతో ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గ సభ్యుల సంఖ్య 33కి చేరింది. కాగా ఇంకో స్థానం ఖాళీగా ఉంది.