కేంద్ర ప్ర‌భుత్వ రూల్స్ ప్ర‌కార‌మే పోస్టులు భ‌ర్తీ చేశాం

ఏపీ శాస‌న‌స‌భ‌లో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ డీఎస్సీని పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో నిర్వ‌హించామ‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. జ‌గ‌న్ రెడ్డి , ప‌రివారం చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించామ‌న్నారు. 154 సెంటర్లలో పరీక్షలు సీబీటీ విధానంలో, ఫలితాలను కూడా పారదర్శకంగా చేపట్టామ‌ని తెలిపారు. పూర్తి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేపట్టాం అన్నారు. జోనల్, రాష్ట్రస్థాయి కమిటీతో పాటు అప్పీలేట్ అథారిటినీ కూడా పెట్టి ఫిర్యాదులను పరిష్కరించామ‌ని చెప్పారు. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనల్నే అమలు చేశామ‌న్నారు. ఉద్యోగాలు వచ్చిన వారంతా అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులని, ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారని చెప్పారు సీఎం. మెగా డీఎస్సీ ద్వారా తమ కష్టానికి ఫలితం దక్కిందని వారంతా తెలిపారన్నారు.

మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఇచ్చామ‌న్నారు . ఎంపిక ప్రక్రియ అంతా ఆన్ లైన్ లోనే ఉంది. ఇంతకంటే పారదర్శకత ఎక్కడ ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఎఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఒక్క డీవియేషన్ కూడా లేదన్నారు.. లిటిగెంట్ పార్టీకి చెందిన వ్యక్తులు 3 వందలకు పైగా కేసులు వేసి అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. వారు చేసిన ఆరోపణలపై అధికారులు పూర్తి అధికారిక సమాచారంతో వివరణ ఇచ్చారని తెలిపారు. ఈ ఆరోపణల్ని ఇక సహించలేక ఇప్పుడు డీఎస్సీ టీచర్లే రోడ్డుపైకి వచ్చారని, అయినా వైసీపీ నేత‌ల‌కు బుద్ది రావ‌డం లేద‌న్నారు సీఎం.
.
కర్నూలులో, నిన్న విజయవాడలో పెద్ద ఎత్తున టీచర్లు ఆందోళన చేశారన్నారు. పిల్లలకు పాఠాలు చెబుతాం, ప్రతిభను కించపరిస్తే గుణపాఠం కూడా చెబుతామని నినదించారన్నారు .ఒడిశా కూలీలతో ,90 ఏళ్ల జగన్ జెన్ జీ వ్యక్తులతో ఆందోళనల్ని చేయించారని మండిప‌డ్డారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా వహిస్తాం. కుట్రలు చేసే పార్టీలకు, వ్యక్తులకు కాదన్నారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాలు విసురుతున్నానని ప్ర‌క‌టించారు చంద్ర‌బాబు నాయుడు.

Leave A Reply

Your Email Id will not be published!