భారత్-జపాన్ ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్మిద్దాం

పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూస్ గోయ‌ల్

జ‌పాన్ : విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ బిజీగా ఉన్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌స్తుతం జ‌పాన్ దేశంలో ప‌ర్య‌టిస్తున్నారు. తదుపరి తరం భారత్-జపాన్ ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్మిద్దాం అని పిలుపునిచ్చారు. జ‌పాన్ లోని టోక్యోలో శ్రీ టాట్సుయో యసునాగా సహ-అధ్యక్షత వహించిన కీడాన్రెన్ (జపాన్ బిజినెస్ ఫెడరేషన్)తో ఒక ఫలవంతమైన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హిరోనోరి కమేజావా, యుజి ఫుకాసావా, దక్షిణాసియా కమిటీకి చెందిన ఇతర విశిష్ట సభ్యులు పాల్గొన్నారు. భారతీయ వ్యాపార నాయకులు , పారిశ్రామికవేత్తలు కూడా ఈ చర్చలో పాలుపంచుకున్నారు.

భారత్, జపాన్ దేశాలు దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా , కీడాన్రెన్ తన 80 ఏళ్ల ప్రభావాన్ని జరుపుకుంటున్న తరుణంలో భారతదేశం యొక్క బలమైన వృద్ధి వేగం , విస్తరిస్తున్న ఆర్థిక పరిసరాల నుండి ఉద్భవించే అపారమైన అవకాశాల గురించి విస్తృతంగా చ‌ర్చించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్. 16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం ఫలితాల ఆధారంగా భారతదేశంలో జపనీస్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను , ఈ దశాబ్దంలో భారతదేశానికి 10 ట్రిలియన్ యెన్ల జపనీస్ పెట్టుబడులను ఆకర్షించాలన్న ఆశయాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించ‌డం జ‌రిగింద‌ని ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రి చెప్పారు.

సెమీ కండక్టర్లు, ఏఐ , ఆవిష్కరణ రంగాలలో తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించు కోవాలని, తద్వారా భారత్-జపాన్ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసి, ప్రపంచ ఎగుమతులకు భారతదేశాన్ని ఒక బలమైన కేంద్రంగా నిలపాలని కీడాన్రెన్ సభ్యులను కూడా ఆహ్వానించానని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!