ఏబీఎన్ రాధాకృష్ణా ఇంత‌లా దిగ‌జారితే ఎలా..? : భూమ‌న

నిప్పులు చెరిగిన మాజీ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్

తిరుప‌తి : ఏబీఎన్ చైర్మ‌న్ రాధాకృష్ణ‌పై నిప్పులు చెరిగారు మాజీ టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి చిల్ల‌ర రాత‌లు రాయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వేద విశ్వవిద్యాలయం నుంచి ఎస్వీబీసీ, శ్రీవాణి ఆలయాల వరకు..వైయస్ఆర్ , జగన్ చేసిన ధార్మిక కార్యక్రమాలే నిద‌ర్శ‌నం అన్నారు. ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో మాజీ సీఎం , దివంగ‌త సీఎంల‌ను మ‌త మార్పిడుల‌తో ముడి పెడుతూ రాధాకృష్ణ చేసిన చిల్ల‌ర ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తున్నామ‌న్నారు. జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయాలనే ప్రయత్నాలు వరుసగా విఫలమవుతుండటంతో ఇప్పుడు మతాన్ని ఆయుధంగా చేసుకుంటున్నారని మండిప‌డ్డారు. పనిగ‌ట్టుకుని జ‌గ‌న్ ను హిందూ వ్య‌తిరేకిగా ముద్ర వేసేందుకు చిల్ల‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, దానిని మానుకోవాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.

ఇలాంటి కుట్రపూరిత రాతలను చూస్తే మహాభారతంలోని శకుని కూడా సిగ్గుపడే పరిస్థితి వ‌స్తుందంటూ ఎద్దేవా చేశారు. అయితే ఆరోపణలు చేసే ముందు చరిత్రను కూడా చూడాలని ఆయన గుర్తు చేశారు.ఆనాడు వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఏర్పాటైందని అన్నారు. శ్రీవారి వైభవాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ( ఎస్వీబీసీ) ని కూడా ఏర్పాటైంద‌న్న విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. పేద కుటుంబాలకు స్వామి వారి సన్నిధిలో వివాహాలు జరిపించే కల్యాణమస్తు ద్వారా వేలాది జంటలకు వివాహాలు నిర్వహించార‌న్నారు. గ్రామ గ్రామాన హిందూ ధర్మ ప్రచారం కోసం భజన మండళ్లు, ధర్మరథాలు, శ్రీనివాస కల్యాణాలు, దళిత గోవిందం వంటి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులతో ధార్మిక సదస్సులు నిర్వహించిన‌ట్లు పేర్కొన్నారు.

GO 746 ద్వారా తిరుమల ఏడు కొండల పవిత్రతను పరిరక్షిస్తూ, తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిరోధించే చర్యలు తీసుకున్నార‌ని వెల్ల‌డించారు మాజీ చైర్మ‌న్. అదే విధంగా జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వేలాది ఆలయాల నిర్మాణం, జీర్ణోద్ధరణ కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టడం జ‌రిగింద‌న్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో స్వామివారి ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చామ‌న్నారు. లోకకల్యాణం కోసం అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభించిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని చెప్పారు. ఇవన్నీ హిందూ ధర్మానికి చేసిన సేవలు కావా రాధాకృష్ణా అని భూమన ప్రశ్నించారు. ఆరోపణలు కాదు.. రికార్డులు మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు.

Leave A Reply

Your Email Id will not be published!