ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి : అనిత వంగ‌ల‌పూడి

112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్ర‌దించాలి

అమ‌రావ‌తి : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ ఎత్తున కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి జ‌నం త‌ల్ల‌డిల్లుతున్నారు. దీంతో ఏపీ స‌ర్కార్ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు రంగంలోకి దిగింది. ఇదిలా ఉండ‌గా పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళా ఖాతంలో వాయుగుండం నేపధ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి సమీక్ష చేప‌ట్టారు. వాయుగుండం పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి, ఎల్లుండి తెల్లవారుజాము సమయంలో విశాఖపట్నం గోపాల్‌పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపారు మంత్రికి విపత్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్.

ప్రస్తుతానికి గోపాల్‌పూర్ (ఒడిశా)కు 180 కిమీ, కళింగపట్నంకు 180 కిమీ, విశాఖపట్నంకు 270 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించారు. అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు. ఉరుముల కార‌ణంగా చెట్ల వ‌ద్ద‌, శిథిలావ‌స్థ‌లో ఉన్న భ‌వ‌నాలలో ఉండ వ‌ద్ద‌ని ఈ సంద‌ర్బంగా సూచ‌చించారు హోం శాఖ మంత్రి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు, బోట్లు, వలలు జాగ్రత్త పరుచు కోవాల‌న్నారు. రానున్న మూడు రోజులు అత్యంత కీలకం అని, ప్రభావిత జిల్లాల యంత్రాంగం హై అలెర్ట్ లో ఉండాలని స్ప‌ష్టం చేశారు వంగ‌ల‌పూడి అనిత‌. ముందస్తు సహాయక చర్యల కోసం ప్రభావిత జిల్లాల్లో SDRF బృందాలు ఉండాలన్నారు.

ఎక్కడా అవాంచనీయ సంఘటనలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు వాయుగుండ తీవ్రతపై ప్రజలకు హెచ్చరిక సందేశాలు పంపించాలన్నారు. విపత్తుల సంస్థ, RTGS అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్న కాజ్‌వేల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించాలన్నారు.
ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, హోర్డింగ్స్, పాత ఇళ్ల వద్ద ఉండరాద‌న్నారు.
అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 లను సంప్రదించాలని కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!