తిరుమ‌ల‌లో ప‌చ్చ‌ద‌నం కోసం ‘వృక్ష గోవిందం’

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన చైర్మ‌న్ బీఆర్ నాయుడు

తిరుమ‌ల : తిరుమ‌ల‌లో నిర్వ‌హించిన శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభవోపేతంగా నిర్వ‌హించ‌డ జ‌రిగింద‌ని చెప్పారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. అలిపిరి సమీపంలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 50 ఎకరాల్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు వృక్ష గోవిందం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. శ్రీవారి సేవ, శ్రీవారి వైద్యసేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. తిరుమ‌ల‌లో బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు.టీటీడీ ఉద్యోగుల హౌసింగ్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు రూ.230 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.

వాహన సేవలకు ముందు ఇప్పటి వరకు లేనివిధంగా 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళా బృందాలకు చెందిన సుమారు 7,871 మంది కళాకారులు వివిధ కళా రూపాలను ప్రదర్శించారు. గరుడ సేవ రోజున 14 రాష్ట్రాల నుంచి 32 కళా బృందాలకు చెందిన 916 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు .శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిసారిగా విదేశీ కళాబృందాల ప్రదర్శనలు నిర్వహించగా, జర్మనీ, సింగపూర్ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయ‌న్నారు. ఉత్తమ కళాప్రదర్శన చేసిన కళా బృందాలను ప్రోత్సహించేందుకు తొలిసారిగా ప్రతిరోజూ వాహన సేవలో నాలుగు కళా బృందాలను టీటీడీ ఈవో సన్మానించారు.

తిరుమలలోని ఆస్థాన మండపం, నాదనీరాజనం, తిరుపతిలోని మహతి ఆడిటోరియం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య కళా మందిరంలోనూ భక్తులను ఆకట్టుకునేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో సుమారు 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్‌ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించి పుష్పాలంకరణ చేపట్టారు. తిరుమలలో చేపట్టిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహన సేవలను భక్తులు సులభంగా వీక్షించేలా 36 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా మరింత నాణ్యమైన హెచ్‌డీ క్వాలిటీలో ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించారు. ప్రముఖ పండితులతో వ్యాఖ్యానాలు అందించారు.

బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు సేవలందించేందుకు 4,000 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారు. భక్తుల ఆరోగ్య భద్రత కోసం 50 మంది వైద్యులు, 150 మంది పారామెడికల్ సిబ్బంది, 16 అంబులెన్సులు అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు చేపట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 3,000 మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. గరుడసేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు .తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. గరుడసేవ రోజున తిరుమలలో 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది విశేష సేవలు అందించారు.

గరుడ సేవ సందర్భంగా తిరుమలలో సేకరించిన సుమారు 173 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. భక్తులకు మరుగుదొడ్లలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. తిరుపతిలోని వివిధ విభాగాలకు చెందిన సుమారు 600 మంది టీటీడీ ఉద్యోగులు గరుడసేవ సందర్భంగా విశేష సేవలందించారు.శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన టీటీడీ అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు, భక్తులందరికీ టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!