న్యూఢిల్లీ : ఎన్నికల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కనుమరుగవుతోందని దీనికి ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు రెండూ కారణమని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హెచ్చరించారు. ఢిల్లీ ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చడంపై ప్రశ్నిస్తూ తనకు, తన భార్యకు కూడా నోటీసులు అందాయని వాపోయారు. భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణను నిర్వహిస్తున్న తీరు, ఈ ప్రక్రియపై సుప్రీంకోర్టు స్పందన కారణంగా, భారతదేశం హామీ ఇచ్చిన సార్వత్రిక వయోజన ఓటు హక్కు “కనుమరుగవుతోంది” అని ఆరోపించారు. 17వ కె.ఎం. బషీర్ మెమోరియల్ లెక్చర్లో దవే మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజకీయ సమానత్వ భావనకు వయోజన ఓటు హక్కు పునాది అని వాదించారు . ఓటర్లను పెద్ద ఎత్తున ప్రశ్నించడం లేదా మినహాయించడం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్నే బలహీన పరుస్తుందని హెచ్చరించారు. ఎన్నికల సంఘం , భారత సుప్రీంకోర్టు పుణ్యమా అని వయోజన ఓటు హక్కు కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే సర్ పేరుతో మమ్మల్ని నిజంగా ఓటర్ల జాబితాలో చేర్చాలా వద్దా అని నా భార్యతో సహా ప్రతి ఒక్కరికీ నోటీసులు అందాయన్నారు. సవరణ ప్రక్రియ సమయంలో పౌరులు ఎదుర్కొనే అనిశ్చితికి తమ అనుభవాన్ని ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.
కచ్చితమైన ఓటర్ల జాబితాలను నిర్వహించడానికి ఉద్దేశించిన ఒక ప్రక్రియఓటు వేయడానికి అర్హత ఉన్న ప్రతి వయోజన పౌరుడికి హక్కు ఉంటుందనే రాజ్యాంగ బద్ధమైన భావనను మార్చడానికి అనుమతించ కూడదు. ఈ ప్రక్రియ పత్రాల భారం, పరిమాణం, ధృవీకరణను ఓటు హక్కు రద్దుగా మార్చగలవని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగించడానికి అనుమతించినందుకు ఆయన సుప్రీంకోర్టును విమర్శించారు. తొలగింపు లేదా మినహాయింపును ఎదుర్కొంటున్న ఓటర్లను న్యాయ జోక్యం తగినంతగా రక్షించలేదని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ , మహారాష్ట్రలలో ఓటర్ల జాబితాల నుండి తొలగించబడిన లేదా తొలగింపు ప్రమాదంలో ఉన్న వ్యక్తుల భారీ సంఖ్యలను ఉదహరించారు. ఈ ప్రక్రియ ద్వారా ఏకంగా 13.5 కోట్ల మందిని భారతీయ ఓటర్ల జాబితా నుంచి లేకుండా చేశారన్నారు. పౌరులు అస్పష్టమైన ప్రమాణాల కింద తమ అర్హతను పదేపదే నిరూపించు కోవాల్సి వస్తే లేదా సవాళ్లు పెండింగ్లో ఉన్నప్పుడు ఓటు వేయలేక పోతే ఒక వ్యక్తి, ఒక ఓటు అనే అధికారిక వాగ్దానం ఆచరణాత్మక అర్థాన్ని కోల్పోవచ్చు అని హెచ్చరించారు.
రాజ్యాంగం భారతదేశాన్ని విఫలం చేయలేదని ఆయన అన్నారు. దానికి బదులుగా, రాజ్యాంగ సంస్థలు పౌరుల హక్కులను, రక్షణలను బలహీన పరుస్తున్నాయని దవే ఆరోపించారు.
