హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు గిరిబాబు శనివారం కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందట తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఆయన మృతి వార్తను ధ్రువీకరించారు. గిరిబాబు వయసు 80 ఏళ్లు. గిరిబాబు ఆకస్మిక మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడగా ఆయన తనదైన ముద్ర వేశారు. ఆనాటి తరం నుంచి నేటి తరం నటీ నటులతో కూడా వివిధ పాత్రలలో నటించారు. స్నేహ పూర్వక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన తనయులలో ఒకరైన రఘు బాబు నటుడిగా, కమెడియన్ గా పేరు పొందారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు గిరి బాబు.
1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించారు గిరిబాబు.. 1973లో ‘జగమే మాయ’ చిత్రంతో విలన్గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారు. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గిరిబాబు మరణం సినీ రంగానికి తీరని లోటుగా నిలవనుంది. గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరి రావు. తనకు ఇద్దరకు కుమారులు ఒకరు రఘుబాబు మరొకరు బోసుబాబు. భార్య శ్రీదేవి 2016లో మరణించారు. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి కలిగిన గిరిబాబు సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసు వెళ్లారు.
గిరిబాబు నటించిన సినిమాలలో జగమే మాయ, అన్నదమ్ముల అనుబంధం, దేవతలారా దీవించండి,
సింహ గర్జన, మెరుపు దాడి , ఎర్రమల్లెలు, కిల్లర్, అతడు, గీత గోవిందం, జాతి రత్నాలు ప్రముఖంగా ఉన్నాయి. నటనతో పాటు సినిమాల నిర్మాణం, దర్శకత్వం లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. ఇందులో ఇంద్రజిత్, రణరంగం, నీ సుఖమే నే కోరుతున్నా ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో విలన్గా ప్రారంభమై, హాస్యనటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి గిరిబాబు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
