ఉత్తర ప్రదేశ్ : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ , మాజీ సీఎం కుమారి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ను ఏకి పారేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సమాజ్వాదీ పార్టీ అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషలిస్ట్ నినాదాలతో ఎస్పీ పార్టీ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తూనే వాస్తవానికి బంధుప్రీతిని , డబ్బు ఆధారిత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆమె ఆరోపించారు. బంధుప్రీతి , డబ్బు ఆధారిత రాజకీయాలను అనుసరిస్తోందని, అలాగే సోషలిజం, పీడీఏ ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న ఆ పార్టీ వాదనలకు వారి చర్యలు విరుద్ధంగా ఉన్నాయని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు ఆరోపించారు. రాజ్యసభ అభ్యర్థులుగా ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ , ధన్రాజ్ పరిమల్ నాథ్వానీలను ఎంపిక చేయడంపై కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఉత్తరప్రదేశ్ నుండి జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం ఎస్పీ సెప్టెంబర్ 30న ఈ ఇద్దరు అభ్యర్థుల తరపున నామినేషన్లు దాఖలు చేసింది.
ఎన్నిక చిన్నదైనా లేదా పెద్దదైనా సరే బీఎస్పీ ఎప్పుడూ కుటుంబ సభ్యులకు, బంధువులకు లేదా ధనవంతులకు ఎన్నికల టిక్కెట్లు ఇవ్వదని మాయావతి పేర్కొన్నారు. దానికి బదులుగా పేద, మధ్యతరగతి , బలహీన వర్గాలకు చెందిన కష్టపడి పనిచేసే అంబేద్కర్ వాద కార్యకర్తలను పార్టీ బరిలోకి దింపుతుందని ఆమె చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీలా కాకుండా, బీఎస్పీ ఏ ఎన్నికల్లోనూ కుటుంబ సభ్యులు, బంధువులు, తోబుట్టువులు, మేనల్లుళ్లు లేదా సన్నిహితులకు, అలాగే ముఖ్యంగా పెద్ద పెట్టుబడిదారులు, ధనవంతులకు టిక్కెట్లు ఇవ్వదని స్పష్టం చేశారు. పార్టీ వారి ఆర్థిక శక్తిపై ఆధార పడదన్నారు. దానికి బదులుగా పేద, మధ్యతరగతి , బలహీన వర్గాల నుండి కష్టపడి పనిచేసే అంబేద్కర్ వాదులను అభ్యర్థులుగా నామినేట్ చేస్తుందని సంచలన ప్రకటన చేశారు.
