కేంద్రం స‌హ‌కారం మ‌రిచి పోలేం : చంద్ర‌బాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డ అనంత్ అంబానీ అంటూ ప్ర‌శంస‌

అన్న‌మ‌య్య జిల్లా : కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి అందిస్తున్న స‌హ‌కారం మ‌రిచి పోలేమ‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు సహకరించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందిస్తున్న సహకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అంతే కాకుండా అనంత్ అంబానీని ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డగా భావిస్తున్నామని శుక్ర‌వారం అన్న‌మ‌య్య జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో జ‌రిగిన కార్య‌క్ర‌మం వేదిక మీద ప్రకటించ‌చారు చంద్ర‌బాబు నాయుడు. రాయలసీమ పండించిన పండ్ల ఉత్పత్తులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రిలయెన్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీకి అందించారు.

గ్లోబల్ హార్టికల్చర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలన్న గాంధీజీ మాటల్ని నిజం చేస్తూ రాయలసీమలో చారిత్రక కార్యక్రమం ప్రారంభించు కోవ‌డం జ‌రిగింద‌న్నారు సీఎం. కేంద్రం స‌హ‌కారంతో కరవు సీమను రూ.1 లక్ష కోట్లతో గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం అన్నారు . రిలయన్స్ సంస్థ సహకారంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన చేయ‌డం సంతోషంగా ఉంద‌ని చెప్పారు. ఐఐఎంలో మేనేజ్మెంట్ నిపుణులు తయారవుతారని, ఐఐటీలో సాంకేతిక నిపుణులు తయారవుతారని పేర్కొన్నారు. ఐఎస్బీలో పారిశ్రామిక వేత్తలో నైపుణ్యాలు పెంచుకుంటారని తెలిపారు. ఐఎస్ఏలో వ్యవసాయంలో లీడర్లు తయారవుతారని చెప్పారు.

మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్న ఐఎస్ఏలో ఉద్యాన రంగం కీలకం అవుతుందన్నారు. రైతుల ఆదాయం పెరిగి రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందని వెల్ల‌డించారు సీఎం. సీమ దశాదిశా మార్చే గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ ప్రంపంచానికే ఫ్రూట్ బౌల్ గా మారుతుందన్నారు. కేంద్ర సహకారంతో రూ.40 వేల కోట్లు, ప్రైవేటు పెట్టుబడులు రూ.60 వేల కోట్ల వ్యయం చేసేలా ప్రణాళికలు రూపొందించిన‌ట్లు వెల్ల‌డించారు. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమలోని మొత్తం 10 జిల్లాల్లో 5,860 గ్రామాలు 201 క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. 6 లక్షల ఎకరాల్లో అదనంగా ఉద్యాన సాగు విస్తరించేలా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు సీఎం.

Leave A Reply

Your Email Id will not be published!