ప్ర‌యాణీకుల కోసం ఆర్టీసీ, మెట్రో ఉమ్మ‌డి పాస్

తెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ విప్లవం

హైదరాబాద్ : తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, సమగ్రంగా, ప్రయాణికులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) , హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంయుక్తంగా ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్ తో పాటు మీ టికెట్ పేరుతో మొబైల్ యాప్, డిజిటల్ వీక్లీ బస్ ప్లాన్ ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. హైదరాబాద్ ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్ తో క‌లిసి ప్రారంభించారు. హైదరాబాద్‌లో ప్రతిరోజూ భారీ సంఖ్యలో ప్రజలు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లను వినియోగిస్తున్న నేపథ్యంలో రెండు ప్రజా రవాణా వ్యవస్థలను అనుసంధానం చేస్తూ కామన్ పాస్‌ను ప్రవేశపెట్టారు.

ఈ పాస్‌తో ఓఆర్ఆర్ పరిధిలో నడిచే ఆర్టీసీ సిటీ బస్సుల్లో (పుష్పక్ మినహా), మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు వీలు క‌లుగుతుంది. కామన్ పాస్‌లు అన్ని మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి. మొదటిసారి కార్డు తీసుకునేటప్పుడు రూ.100 డిపాజిట్ చెల్లించాలి. కార్డును తిరిగి అప్పగించినప్పుడు ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. ఇక రోజూ వారీ పాస్ కొనుగోలుకు రూ 400 గా నిర్ణ‌యించారు. ఇందులో మెట్రో కు రూ. 300, ఆర్టీసీకి రూ. 100. నెల వారీ పాస్ విష‌యానికి వ‌స్తే రూ. 8,500 చెల్లించాల్సి ఉంటుంది. మెట్రోలో ప్ర‌యాణించేందుకు రూ. 7000, ఆర్టీసీలో ప్ర‌యాణం చేసేందుకు గాను రూ. 1500 పే చేయాలి.

ఈ కామన్ పాస్ ద్వారా మెట్రో స్టేషన్ల నుంచి నివాస, వాణిజ్య ప్రాంతాలకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది. ప్రజా రవాణా వినియోగం పెరగడం ద్వారా ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యం తగ్గించేందుకు కూడా ఇది దోహద పడుతుంది. సిటీ బస్సు ప్రయాణికుల కోసం ఆర్టీసీ మీ టికెట్ ’ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్‌లోనే బస్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు . బోర్డింగ్ పాయింట్, గమ్యస్థానాన్ని ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయవచ్చు. డైనమిక్ QR కోడ్‌తో డిజిటల్ టికెట్ పొందవచ్చు. రోజువారీ, వారపు, నెలవారీ పాస్‌లను పొందవచ్చు. దీంతో కాగితపు టికెట్ల అవసరం తగ్గడంతో పాటు నగదు, చిల్లర సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రయాణికుల సమయం కూడా ఆదా అవుతుంది.

రోజువారీ ప్రయాణికుల సౌకర్యార్థం రూ.600తో డిజిటల్ వీక్లీ బస్ పాస్ ను ప్రారంభించారు. మీ టికెట్ యా్ప ద్వారా ఈ పాస్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. డైనమిక్ QR కోడ్‌తో కూడిన పాస్‌ను బస్సులో సులభంగా వినియోగించు కోవచ్చు. పాస్ గడువు పూర్తయిన తర్వాత యాప్ ద్వారానే రెన్యూవల్ చేసుకునే సదుపాయం కల్పించారు.

Leave A Reply

Your Email Id will not be published!