మీడియా అధినేత భార్య స్మితా జాదవ్ కు బీజేపీ టికెట్
మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన
ముంబై : మహారాష్ట్ర శాసన మండలి సభ్యుల ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఇందులో ఎవరూ ఊహించని విధంగా బిగ్ షాక్ ఇచ్చింది పార్టీ నేతలకు. తాజాగా ప్రకటించిన జాబితాలో మీడియా సంస్థ అధినేత భార్యకు కూడా టికెట్ కేటాయించడం విస్తు పోయేలా చేసింది. ఎన్నికల్లో భాగంగా పూణే డివిజన్ గ్రాడ్యుయేట్స్, నాగ్‌పూర్ డివిజన్ గ్రాడ్యుయేట్స్, పూణే డివిజన్ టీచర్స్, ఛత్రపతి సంభాజీనగర్ గ్రాడ్యుయేట్స్, అమరావతి టీచర్స్ నియోజకవర్గాలకు రెండేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23న పోలింగ్ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా పూణే డివిజన్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుండి ‘పుధారి’ గ్రూప్ చైర్మన్ , ఎడిటర్ యోగేష్ జాదవ్ భార్య డాక్టర్ స్మితా జాదవ్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపింది.
న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం నాగ్‌పూర్ డివిజన్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుండి సుధాకర్ విఠల్‌రావు కోహ్లే , పూణే డివిజన్ టీచర్స్ నియోజకవర్గం నుండి కౌస్తుభ్ మురళీధర్ గావడే పోటీ చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన కోహ్లే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సన్నిహితుడిగా , ‘శ్రీ స్వామి వివేకానంద శిక్షణ సంస్థ’ సీఈఓగా గుర్తింపు పొందారు. స్మితా జాదవ్ ‘పుధారి పబ్లికేషన్స్’ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. జాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటికీ, ఆమె ఇంకా బీజేపీలో చేరలేదు. ఆమె ఈ సాయంత్రం పూణేలో అధికారికంగా పార్టీలో చేరనున్నారు అని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. పూణే డివిజన్ గ్రాడ్యుయేట్స్, నాగ్‌పూర్ డివిజన్ గ్రాడ్యుయేట్స్, పూణే డివిజన్ టీచర్స్, ఛత్రపతి సంభాజీనగర్ గ్రాడ్యుయేట్స్ , అమరావతి టీచర్స్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అక్టోబర్ 23న పోలింగ్ , 27న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన , సునేత్ర పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తో కూడిన అధికార ‘మహాయుతి’ కూటమి 3:1:1 సీట్ల పంపకం విధానాన్ని ఖరారు చేసింది. దీని ప్రకారం, బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేయనుండగా, ఎన్సీపీ , శివసేన చెరో స్థానంలో తమ అభ్యర్థులను బరిలోకి దింపనున్నాయి.
