ర‌హ‌దారుల ప్రాజెక్టుల‌ను వేగ‌వంతం చేయండి

అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

హైద‌రాబాద్ : కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ జోన్‌లో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని , ప్రజల భవిష్యత్తు రవాణా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి క్యూర్ జోన్‌లో ప్రజా రవాణా మెరుగుదల, రోడ్డు అనుసంధానం , శుద్ధి చేసిన నీటి వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోకి వచ్చే ప్రాంతమే ఈ క్యూర్ జోన్. ప్రజలు ఎక్కువగా వెళ్లే ప్రాంతాలు, కార్మికులు, ఉద్యోగుల పని ప్రదేశాలను మెట్రో, ఎంఎంటీఎస్ ,బస్సు స్టేషన్లతో అనుసంధానించేలా ‘పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్’ వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్టీ వ్యవస్థలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని స్ప‌ష్టం చేశారు సీఎం.

కీలక ప్రాంతాల ఎంపిక, అత్యాధునిక సాంకేతికత వినియోగం, సమర్థవంతమైన నిర్వహణ, అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు ఫ్లైఓవర్లు , అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. కేటీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ‘వన్-వే’ విధానాన్ని అమలు చేయడంపై కూడా సమీక్షించారు. వన్-వే ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు, వివిధ ప్రాంతాల నుండి వచ్చే రోడ్ల అనుసంధానం, అలాగే ‘ఫ్రీ-లెఫ్ట్ టర్న్’ ‘యు-టర్న్’ సదుపాయాల కల్పన గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నాగార్జున సర్కిల్ , జూబ్లీ చెక్ పోస్ట్ మధ్య ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అడ్డంకులుగా ఉన్న యుటిలిటీలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ముంబై వంటి నగరాల్లో ఇలాంటి ప్రాజెక్టులు ఏడాదిలోపే పూర్తవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. అక్కడ అనుసరించిన సాంకేతికత , పని విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని ప్రాజెక్టుల పూర్తికి ఏడాది గడువును నిర్దేశించారు. హైదరాబాద్-ముంబై బుల్లెట్ రైలు కారిడార్‌కు సమాంతరంగా రేడియల్ రోడ్డు నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. శంకర్ పల్లి , చేవెళ్ల మధ్య ఉన్న రోడ్లను వెడల్పు చేయడం లేదా కొత్త రోడ్లను నిర్మించడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

Leave A Reply

Your Email Id will not be published!