యుద్ధ ప్రాతిపదికన కరువు నివేదికలు సమర్పించాలి
ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న కరువు పరిస్థితులపై తక్షణమే నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. కరువు ప్రభావిత మండలాలను అంచనా వేయాలని, పంట వైవిధ్యీకరణను ప్రోత్సహించాలని , గ్రామీణ ఉపాధి కోసం వీబీజీఆర్‌ఏఎంజీ నిధులను వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వర్షపాత లోటు నేపథ్యంలో కాలానుగుణ పరిస్థితులను సమీక్షించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడం, కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు రూపొందించడం , అవసరమైన ఉపశమన చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈనెల 12వ తేదీన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రులతో సంప్రదింపులు జరుపుతారని, ఆ తర్వాత సచివాలయం నుండి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు , అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని తెలిపారు సీఎస్.
ఇందులో రైతులు రైతు వేదికల ద్వారా పాల్గొంటారని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఈ ప్రక్రియలో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి రైతులను రక్షించడానికి పంట వైవిధ్యీకరణ , ముందస్తు ప్రణాళిక అత్యవసరమని నొక్కి చెప్పారు సంజయ్ జాజు. నిరంతర విద్యుత్ సరఫరాకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కరువు మాన్యువల్‌ను అధ్యయనం చేసి ప్రభావిత మండలాలను గుర్తిస్తూ నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. అలాగ గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పిస్తూనే దీర్ఘకాలిక ఆస్తుల నిర్మాణానికి నిధులను వినియోగించు కోవాలని సూచించారు. చెరువుల్లో పూడికతీత, పొలాలకు నీరందించే కాలువల శుభ్రత, గ్రామీణ రహదారుల మెరుగుదల, కందకాల తవ్వకం, నీటి సంరక్షణ ప్రాజెక్టుల వంటి భారీ స్థాయి శ్రమతో కూడిన పనులను చేపట్టాలని పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ కలెక్టర్లకు వివరించారు.
