స్థానిక సంస్థల ఎన్నికల్లో సీసీటీవీ, వీడియోగ్రఫీ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన తన తుది ఉత్తర్వులో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సీసీటీవీ లేదా వీడియోగ్రఫీ కవరేజీని తప్పనిసరి చేసింది. నామినేషన్లు స్వీకరించే కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలతో పాటు పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కూడా సీసీటీవీ కెమెరాలు లేదా వీడియో రికార్డింగ్ సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది.
ఎన్నికల పిటిషన్లు దాఖలు చేయడానికి గడువు ముగిసే వరకు ఆ ఫుటేజీని భద్రపరచాలని పేర్కొంది. ఒకవేళ ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తే, ఆ కేసుపై తుది తీర్పు వచ్చే వరకు ఫుటేజీని భద్రంగా ఉంచాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఎన్నికల ట్రిబ్యునల్ కోరినప్పుడు సంబంధిత ఫుటేజీని వారికి అందించాలని స్పష్టం చేసింది. అలాగే, దరఖాస్తు చేసుకున్న మీదట, ఎన్నికల పిటిషన్‌లోని పార్టీలకు కూడా దీనిని అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా తగిన భద్రత కల్పించాలని పోలీస్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలు నామినేషన్ల దాఖలు నుండి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన భద్రతా చర్యలను ఏర్పాటు చేస్తాయని తెలిపింది. అలాగే, ఎన్నికల వివాదాల పరిష్కారం కోసం ఫుటేజీని భద్రపరచడం, అందుబాటులో ఉంచడం తప్పనిసరి చేస్తాయి.
