1.06 ల‌క్ష‌ల ర‌వాణా శాఖ ఉద్యోగుల‌కు భారీ బోన‌స్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం జోసెఫ్ విజ‌య్

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు. 1.06 లక్షల మందికి పైగా రవాణా శాఖ ఉద్యోగులకు దీపావళి పండుగ బోనస్‌గా రూ. 167.12 కోట్లను పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ దీపావళి బోనస్ నేరుగా జమ చేయబడిందని రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్తిబన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశాల మేరకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర రవాణా సంస్థల ఉద్యోగులకు (మొత్తం 1,06,001 మంది) ఈ బోనస్ , ఎక్స్-గ్రేషియా చెల్లింపులు జరిగాయి. రవాణా కార్మికుల కృషిని గుర్తించేందుకు, పండుగ సందర్భంగా వారికి ఆర్థిక ప్రయోజనాలను కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ , ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటు ధరలో రవాణా సదుపాయాలను కల్పించడంలో ఎనిమిది రాష్ట్ర రవాణా సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్ర‌శంస‌లు కురిపించారు.

ఈ సంస్థలు మొత్తం 10,172 మార్గాల్లో 21,333 బస్సులను నడుపుతున్నాయి. తమిళనాడు అంతటా గ్రామాలు, పట్టణాలు , ప్రధాన నగరాలను అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు మంత్రి. ప్రతిరోజూ సుమారు 2.18 కోట్ల మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించు కుంటున్నారని తెలిపారు; తద్వారా రాష్ట్ర ప్రభుత్వ రవాణా వ్యవస్థ, తమిళనాడు ప్రజా మౌలిక సదుపాయాలలో అత్యంత ముఖ్యమైన విభాగాలలో ఒకటిగా నిలుస్తోందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ మద్దతుతో అమలు చేస్తున్న వివిధ పథకాల కింద దాదాపు 72 శాతం మంది ప్రయాణికులు ఉచితంగా లేదా రాయితీ ధరలతో ప్రయాణిస్తున్నారని వెల్ల‌డించారు. మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, సమాజంలోని ఇతర అర్హ వర్గాల ప్రజల రాకపోకలను సులభతరం చేయడంలో, అలాగే ప్రజా రవాణాను అందరికీ అందుబాటు ధరలో ఉంచడంలో ఈ రాయితీలు ఎంతగానో దోహద పడ్డాయని పేర్కొన్నారు.

ఇంతటి భారీ రవాణా వ్యవస్థను నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా చేయడంలో రవాణా శాఖ ఉద్యోగులు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వారి సేవలను గుర్తించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దీపావళి బోనస్ , ఎక్స్-గ్రేషియా చెల్లింపులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించార‌ని తెలిపారు ర‌వాణా శాఖ మంత్రి. ఉద్యోగులను ప్రోత్సహించడానికి, వారి సేవలను గుర్తించడానికి మరియు రవాణా సంస్థలన్నింటిలో నైతిక స్థైర్యాన్ని బలోపేతం చేయడానికి ఈ ఆర్థిక సహాయం ఉద్దేశించ బడిందని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!