హైదరాబాద్ : ఆపిల్ సంస్థ కీలక ప్రకటన చేసింది. భారతదేశంలో సెప్టెంబర్ త్రైమాసికానికి గాను ఆపిల్ సంస్థ అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ విషయాన్ని సంస్థ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ( సీఈఓ) జాన్ టెర్నస్ వెల్లడించారు. . ప్రపంచ వ్యాప్తంగా మ్యాక్ విభాగం ద్వారా 10.8 బిలియన్ డాలర్ల ఆదాయం లభించిందని తెలిపారు. సరఫరా పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇది గత ఏడాదితో పోలిస్తే 24 శాతం వృద్ధిని సూచిస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 26తో ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికానికి సంబంధించిన ఆదాయ వివరాలను వెల్లడించారు సీఈఓ. ఈ సందర్బంగా జాన్ టెర్నస్ మీడియాతో మాట్లాడారు. అమెరికా, ఐరోపా, గ్రేటర్ చైనా , ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి కంపెనీ రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసిందని చెప్పారు. మేము అభివృద్ధి చెందిన , అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు రెండింటిలోనూ సెప్టెంబర్ త్రైమాసిక ఆదాయ రికార్డులను నెలకొల్పామని అన్నారు.
ముఖ్యంగా భారతదేశంలో అయితే ఇది ఆల్-టైమ్ రికార్డు అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా, అలాగే అమెరికా, చైనా , భారతదేశాల్లో పాత పరికరాల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య పరంగా కూడా ఈ త్రైమాసికంలో రికార్డు నమోదైందని వెల్లడించారు సీఈఓ. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ ద్వారా 57.6 బిలియన్ డాలర్ల ఆదాయం లభించిందని చెప్పారు. సరఫరా సమస్యలు, విదేశీ మారకపు రేట్ల ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ ఇది గత ఏడాదితో పోలిస్తే 17 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఇక ‘ఆపిల్ పే’ విషయానికి వస్తే తాము ఇటీవల భారతదేశంలో యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి దీనిని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో ఇది అత్యంత సురక్షితమైన , సులభతరమైన చెల్లింపు విధానాన్ని అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ‘ఆపిల్ పే’ 90కి పైగా దేశాల్లో అందుబాటులో ఉందన్నారు. ఇది వినియోగదారులకు ప్రతి లావాదేవీలోనూ పూర్తి భద్రతను, ప్రశాంతతను కల్పిస్తుందని ఆపిల్ సీఈఓ చెప్పారు.
