భారీ ఎత్తున ఉద్యోగాలు తొలగించే పనిలో వాల్ట్ డిస్నీ
ఈ ఏడాది ఏప్రిల్ లో 1,000 ఉద్యోగాలు తొలగించింది
హైదరాబాద్ : మరో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ వాల్ట్ డిస్నీ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. ఉద్యోగులను తొలగించే పనిలో పడింది. ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా వేలాది ఉద్యోగాలను తొలగించేందుకు డిస్నీ సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో సుమారు 1,000 ఉద్యోగాలను తొలగించింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగుల సంఖ్యను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. వాల్ట్ డిస్నీ కంపెనీ తన వ్యయాలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా వార్షిక ఖర్చులను 20 శాతం వరకు తగ్గించాలని మేనేజర్లను ఆదేశించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాకపోవడం, స్ట్రీమింగ్ మార్కెట్లో పెరుగుతున్న పోటీ ,అంతర్జాతీయ థీమ్ పార్కులకు వచ్చే సందర్శకుల సంఖ్యలో వృద్ధి మందగించడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పునర్వ్యవస్థీకరణ అన్ని విభాగాలపై సమానంగా ఉండక పోవచ్చు; కొన్ని విభాగాల్లో ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.
ఇలా ఆదా చేసిన నిధులను చలనచిత్ర , టెలివిజన్ కంటెంట్, సాంకేతికత, థీమ్ పార్క్ కార్యకలాపాలు , విస్తరిస్తున్న క్రూయిజ్ వ్యాపారం వంటి కీలక వృద్ధి రంగాల్లో పెట్టుబడిగా పెట్టాలని డిస్నీ భావిస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు డిస్నీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే, ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నారనే దానిపై స్పష్టత లేదు. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి డిస్నీలో సుమారు 2,31,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. లాభదాయకతను పెంచుకోవడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి గత కొన్నేళ్లుగా డిస్నీ పలు దఫాలుగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. సెప్టెంబర్లో వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం అప్పట్లో డిస్నీ తన మానవ వనరులు , సాంకేతిక విభాగాల్లో వందలాది ఉద్యోగాలను తొలగించింది. ఈ ఏడాది ఆరంభంలో, 2025లో జరగనున్న ఇతర ఉద్యోగ కోతల తర్వాత, ఏప్రిల్లో కంపెనీ సుమారు 1,000 ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం. సుమారు 7,000 ఉద్యోగాల తొలగింపుతో పాటు, 5.5 బిలియన్ డాలర్ల పొదుపు లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నారు.
