టాలీవుడ్ లో న‌టించ‌డంపై రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్

సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీసిన న‌టి వ్యాఖ్య‌లు

ముంబై : బాలీవుడ్ నటి రాధికా ఆప్టే మ‌రోసారి సంచల‌నంగా మారారు. త‌ను తెలుగు సినిమాల్లో పని చేయడంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి చర్చ నీయాంశమయ్యారు. గతంలో తాను నటించిన ఒక తెలుగు సినిమా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ అభిమానుల నుంచి విమర్శలకు దారితీశాయి. చాలా మంది ఆమె అభిప్రాయాలను ప్రశ్నిస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వివిధ భాషల్లో నటించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన రాధిక ఆప్టే సుమారు 10-12 ఏళ్ల క్రితం ‘లెజెండ్’, ‘లయన్’ అనే రెండు తెలుగు చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లోనూ ఆమె నందమూరి బాలకృష్ణ సరసన కనిపించారు. ఆ తర్వాత ఆమె ప్రధానంగా హిందీ చిత్రాలు, ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించారు.

తన తాజా సిరీస్ ‘అక్క’ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఇంటర్వ్యూల్లో దక్షిణాది చిత్రాల్లో పని చేసేటప్పుడు ఎదుర్కొన్న సవాళ్ల గురించి రాధిక మాట్లాడారు. సినిమా పేరును నేరుగా ప్రస్తావించకుండా ఒక తెలుగు చిత్రంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో తనకంటే చాలా పెద్ద వయసున్న నటుడికి ప్రేయసిగా నటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు రాధికా ఆప్టే. అంతేకాకుండా ఆ కథలో తన పాత్ర తన సొంత మామనే వివాహం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సినిమా మధ్యలోనే తన పాత్ర చని పోతుందని కూడా వెల్లడించారు. ఈ విషయాలను ఆమె హాస్యభరితమైన శైలిలో పంచుకోగా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏ సినిమా పేరు చెప్పక పోయినప్పటికీ అది బాలకృష్ణ సరసన నటించిన ‘లెజెండ్’ చిత్రమేనని ప్రేక్షకులు భావిస్తున్నారు. రాధిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలకు దారితీశాయి. చాలామంది తెలుగు సినీ అభిమానులు ఆమెను విమర్శిస్తున్నారు. ఒక పాత్రను అంగీకరించి, ఆ పరిశ్రమలో పనిచేసిన తర్వాత, ఇప్పుడు ఆ సినిమా గురించి ప్రతికూలంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో పురుష నటుల ఆధిపత్యం గురించి రాధిక ఆప్టే గతంలో కూడా మాట్లాడారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు భారతీయ సినిమాల్లో నటీమణుల పాత్రలు, తెరపై కనిపించే జంటల మధ్య వయసు వ్యత్యాసం , లింగ ప్రాతినిధ్యం వంటి అంశాలపై మరోసారి చర్చకు దారితీశాయి.

Leave A Reply

Your Email Id will not be published!