మ‌స్క‌ట్ లో కోడంగ‌ల్ మ‌హిళ‌ను ర‌క్షించిన కేటీఆర్

కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన తుప్పుడు ల‌క్ష్మి ధ‌న్య‌వాదాలు

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు.. ఆప‌ద‌లో ఉన్న మ‌హిళ‌కు అండ‌గా నిలిచారు. ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసం చేయడంతో మస్కట్‌లో చిక్కుకు పోయిన కొడంగల్ నియోజకవర్గానికి చెందిన తుప్పుడు లక్ష్మిని కేటీఆర్ సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చారు. ఆమె కుమారుడు రాజుకు ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లోపు తల్లిని తిరిగి ఇంటికి చేరుస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకుని, ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని గోకాఫసల్‌వాడ గ్రామానికి చెందిన తుప్పుడు లక్ష్మి ఉపాధి కోసం ఫిబ్రవరి 27న తన భర్త వెంకప్పతో కలిసి మస్కట్ వెళ్లారు. అయితే అక్కడకు వెళ్ళిన తర్వాత ఏజెంట్ చెప్పిన పనికి భిన్నమైన పనులు అప్పగించడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే కాకుండా ఆమె యజమాని (కఫీల్) ఆమె పాస్‌పోర్ట్‌ను లాగేసుకుని, తిరిగి స్వదేశానికి పంపడానికి నిరాకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమెను విదేశాలకు పంపిన ఏజెంట్ కూడా ఫోన్లకు స్పందించడం మానేశారు. త‌న‌ను తిరిగి భారత్‌కు పంపాలంటే రూ. 2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు లక్ష్మి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ల‌క్ష్మి ఉపయోగిస్తున్న వైఫై , సిమ్ కార్డ్ సేవలను కూడా నిలిపి వేశారు. దీంతో కుటుంబ సభ్యులతో ఆమెకున్న సంబంధాలు పూర్తిగా తెగి పోయాయి. చివరకు,పొరుగువారి ఇంటర్నెట్ సహాయంతో ఆమె తన కుమారుడు రాజును సంప్రదించి, అక్కడ తాను పడుతున్న కష్టాలను వివరించారు.

తన తల్లి పడుతున్న కష్టాలను చూసి చలించి పోయిన కుమారుడు రాజు సెప్టెంబర్ 29న కేటీఆర్ ను కలిసి తమ కుటుంబ పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన కేటీఆర్ పాస్‌పోర్ట్ సమస్యను పరిష్కరించి, నెల రోజుల్లోపు తల్లిని సురక్షితంగా తిరిగి తీసుకు వస్తానని రాజుకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ వెంటనే రంగంలోకి దిగి సంబంధిత అధికారులకు లేఖ రాయడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకున్నారు. దీని ఫలితంగా లక్ష్మి సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. స్వదేశానికి చేరుకుని, తన కుటుంబ సభ్యులతో కలిసిన తర్వాత, లక్ష్మి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో అండగా నిలిచినందుకు, అలాగే తన కుమారుడికి ఇచ్చిన మాటను కేవలం నెల రోజుల్లోనే నెర వేర్చినందుకు, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె భావోద్వేగంతో చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!