జైలర్ -3 పై ఫోకస్ పెట్టిన నెల్సన్ దిలీప్ కుమార్
జైలర్ -1, 2 భారీ సక్సెస్ తో చిత్ర నిర్మాణ సంస్థకు బిగ్ రిలీఫ్
చెన్నై : తమిళ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. తన టేకింగ్, మేకింగ్ ఇతర దర్శకుల కంటే భిన్నంగా ఉంటుంది. తను తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి చేసిన మూవీ జైలర్ . ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ గా జైలర్ -2 కూడా తనే తీశాడు. భారీ ఖర్చు పెట్టింది చిత్ర నిర్మాణ సంస్థ. ఈ సినిమా గత నెల అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. అంతే కాదు భారీ గిఫ్టులను కూడా చిత్ర బృందానికి నిర్మాణ సంస్థ ఇచ్చింది. ఇది పక్కన పెడితే మరో కీలకమైన పాయింట్ తో రజనీకాంత్ తోనే జైలర్ -3 రాబోతోందంటూ ప్రకటించింది. దీంతో తలైవా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే 70 ఏళ్లకు పైగా ఉన్న రజనీకాంత్ తో ఎలాంటి రిస్క్ లేకుండా కేవలం తన మేనరిజంతో సినిమాను నడిపించిన తీరు ప్రేక్షకులను మెచ్చుకునేలా చేసింది. దీంతో రాబోయే సీక్వెల్ జైలర్ -3 ఏ మేరకు ఉంటుందోనని ఇప్పటి నుంచే ఆలోచనలో పడ్డారు అభిమానులు.
తలైవా ఏది చేసినా సంచలనమే. ఇక దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ రూపొందించిన ‘జైలర్’ ఫ్రాంచైజీ సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌కు గణనీయమైన ఊపునిచ్చింది. ఈ ఫ్రాంచైజీలోని రెండు చిత్రాలు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. కాగా తాజాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సినిమా బడ్జెట్, నటీనటులు, పారితోషికం విషయంలో సన్ పిక్చర్స్ నెల్సన్‌కు పూర్తిస్వేచ్ఛను ఇచ్చింది. మూడవ భాగానికి సంబంధించిన ప్రాథమిక ఆలోచనను దర్శకుడు ఇప్పటికే అభివృద్ధి చేశారని చెబుతున్నారు. ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లే ముందు, ఆయన స్క్రీన్‌ప్లేపై కొన్ని నెలల పాటు పని చేయాల్సి ఉంటుందని అంచనా. మొత్తంగా దర్శకుడు టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రను ఎలా తీర్చిదిద్దుతాడో, కథకు కొత్త మలుపులు ఎలా తీసుకువస్తాడో చూడటానికి అభిమానులు ప్రత్యేకంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
