ప్రజాస్వామిక వాదులంతా ఏకం కావాలి : సీఎం

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల్ని నెర‌వేర్చేందుకు పోరాడాలి

హైద‌రాబాద్ : ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులంతా ఏకమై కలిసికట్టుగా పోరాటం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజల్లో వ్యక్తమవుతున్న కలలు, ఆకాంక్షలను అర్థం చేసుకుని, వాటిని నెరవేర్చడానికి మనమంతా చేతులు కలపాలని ప్రజాస్వామ్య వాదులను కోరారు. హైద‌రాబాద్ లోని హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగిన భార‌త్ స‌మ్మిట్ 2026 ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి డెలివ‌రింగ్ గ్లోబ‌ల్ జ‌స్టిస్ అన్న అంశంపై ప్ర‌సంగించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఆలోచనా ధోరణి కలిగిన ప్రతినిధులు, ప్రభావశీలురు ఒకచోట చేర్చడానికి భారత్ సమ్మిట్ గొప్ప వేదికగా నిలుస్తోందని అన్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో ప్రధానంగా రెండు శక్తుల మధ్య పోరాటం సాగుతోందన్నారు సీఎం. ఒక శక్తి ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుకుంటే మరో శక్తి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని చూస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ్యాంగం, చట్టబద్ధ పాలనకు కట్టుబడి మనముంటే, రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి నియంతృత్వాన్ని రుద్దాలని ఆ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు .ప్రతి పౌరుడికి ఓటుహక్కు ఉండాలని కోరుకుంటే, నియంతృత్వ శక్తులు తమకు నచ్చిన కొన్ని వర్గాలకే ఆ హక్కు కల్పించాలని భావిస్తున్నాయని అన్నారు. మనమంతా పర్యావరణ పరిరక్షణ కోరుకుంటే ఆ శక్తులు పర్యావరణ వినాశనాన్ని కోరుకుంటున్నాయని వాపోయారు సీఎం.

పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతులతో సహా ప్రతి ఒక్కరినీ రక్షించాలని మనమంతా భావిస్తుంటే, వాళ్లు మిలియనీర్ మిత్రులను కాపాడు కోవాలన్న తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. అందరికీ సమాన అవకాశాలు కాకుండా అధికారం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావాలని ఆశిస్తున్నార‌ని పేర్కొన్నారు..ఏక పార్టీ, ఏకవ్యక్తి పాలనకు వ్యతిరేకంగా మనమంతా చర్చలు, సంప్రదింపుల పట్ల విశ్వాసంతో పని చేస్తున్నాం అన్నారు. ఈ పోరాటంలో మనల్ని నిరంతరం నిరోధించాలని ఫైర్ అయ్యారు. మనమంతా ఒక గొప్ప లక్ష్యం కోసం పోరాడుతున్నందున ప్రపంచంలో ఏ శక్తీ మనల్ని నిలువరించ లేద‌న్నారు రేవంత్ రెడ్డి.

ప్రపంచీకరణ ప్రభావాలు, కోవిడ్ మహమ్మారి అనంతర పరిణామాల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు దాదాపు ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. వ్యక్తుల ప్రాథమిక హక్కులపై దాడులు, విద్య, ఉపాధి, వైద్య సేవలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో సతమతమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజల కలలు, ఆకాంక్షలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయని తెలిపారు. లక్షలాది మంది ప్రజలు తమ ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని, వారి సమస్యలను వినాలని, వారి కలలను సాకారం చేయాలని ఆశాభావంతో ఉన్నారని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!