పోలవరం లెఫ్ట్ బండ్ పై రహదారి నిర్మాణం

సీఎస్ ను ఆదేశించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : పుష్కరాల సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా 100 పడకలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్పష్టం చేశారు. అంబులెన్సులు, వైద్య బృందాలు, అత్యవసర చికిత్సా కేంద్రాలను కూడా నియమించేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల సేవలను సమన్వయం చేసుకోవడంతో పాటు మొబైల్ ఆసుపత్రులను కూడా అందుబాటులో ఉంచాలని సీఎం అన్నారు. భక్తులు తాగునీరు, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునికీకరణ, అభివృద్ధి పనులను 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులను కూడా పుష్కరాలకు ముందే పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

రాజమహేంద్రవరం–పోలవరం మధ్య 40 కిలోమీటర్ల జలమార్గంలో ఆరు ఫ్లోటింగ్ పంటూన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. జూన్ నెలలో సాధారణంగా గోదావరిలో ఉండే నీటి ప్రవాహాలపై ముందుగానే అంచనాలు రూపొందించి, అందుకు అనుగుణంగా ఘాట్ల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గోదావరి పుష్కరాలను పర్యావరణ హితంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం, గోదావరి జలాల పవిత్రత కాపాడటం, పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. పుష్కరాలు జరిగే జిల్లాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక టూరిజం సర్క్యూట్ రూపొందించి ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your Email Id will not be published!