హైదరాబాద్ : నేచురల్ స్టార్ నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు నితిన్ పై. నాని సమర్పిస్తున్న మూవీ అలియాస్ రుక్మిణి. ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు నితిన్. ఈ చిత్రంలో తన నటనను ప్రశంసించాడు. ఇది అతని అసలు సామర్థ్యాన్ని బయట పెడుతుందని వ్యాఖ్యానించారు.’అలియాస్ రుక్మిణి’ చిత్ర బృందం ఒక ‘జామ్ పార్టీ’ ద్వారా తమ ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న నాని సినిమా వచ్చిన తీరు పట్ల ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. నితిన్ ఈ అనుభవం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అత్యంత ఆనందంతో నితిన్ మాట్లాడుతూ ‘అలియాస్ రుక్మిణి’ తన కెరీర్లోనే అత్యుత్తమ చిత్రమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ పట్ల తనకు ఎంతో గర్వంగా, నమ్మకంగా ఉందని, తన మనసు నిండా సంతోషం నిండి పోయిందని ఆయన చెప్పారు.
ఈ ప్రాజెక్ట్‌తో తనకున్న అనుబంధం గురించి నాని స్పందించాడు. ‘అలియాస్ రుక్మిణి’ తన జీవితంలో 2026వ సంవత్సరాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చిందని అన్నారు. మురళి మొదట కథ చెప్పినప్పుడే అది ఎంతో అద్భుతంగా, ఆశాజనకంగా అనిపించిందని గుర్తు చేసుకున్నారు. సినిమా పూర్తయ్యాక చూస్తే, అది తన అంచనాలను మించి, నిజాయితీతో , లోతైన భావోద్వేగాలతో అద్భుతంగా వచ్చిందని నాని కొనియాడారు. అంతే కాకుండా దర్శకుడు మురళి కాంత్ దేవసోత్ పనితీరును ప్రశంసించాడు. ఆయన సృజనాత్మక దృక్పథం దిగ్గజ దర్శకుడు భారతీరాజాను గుర్తుకు తెస్తుందని నాని పేర్కొన్నారు.
ఈ వేడుక నాని, నితిన్‌లకు పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది. తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో నితిన్ నటించిన ఒక చిత్రానికి పని చేశానని నాని వెల్లడించారు. ఇది ఒక ‘ఫుల్ సర్కిల్’ (పూర్తి వలయం వంటి) అనుభూతి అని, తన కెరీర్ ప్రారంభ దశలో నితిన్‌తో అనుబంధం ఉండగా, ఇప్పుడు నితిన్ కొత్త ప్రయాణంలో మళ్ళీ తనతో కలిసి పని చేయడం విశేషమని ఆయన అన్నారు. నటుడిగా నితిన్ సాధించిన ఎదుగుదల గురించి ప్రస్తావించారు. ‘జయం’, ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ వంటి చిత్రాల్లో నితిన్ నటనను నాని ప్రస్తావించారు. అయితే, ‘అలియాస్ రుక్మిణి’ చిత్రం నితిన్‌లోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుందని పేర్కొన్నారు.
