పోల‌వ‌రం నాణ్య‌త విష‌యంలో రాజీ పడొద్దు

ఈసీఆర్‌ఎఫ్‌ పనుల నాణ్యతపై పీపీఏ సీఈఓ

పోల‌వ‌రం : పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణ పనుల నాణ్యతను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సంజీవ్‌ వోహ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న ఆయన.. సుమారు మూడు గంటల పాటు ఈసీఆర్‌ఎఫ్‌ పనులను కలియ తిరుగుతూ పరిశీలించడమే కాకుండా, కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి నిర్మాణ పటిష్ఠతను తనిఖీ చేశారు. కేంద్ర మృత్తిక, పదార్థాల పరిశోధన కేంద్రం (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణులు కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు. మట్టి, రాయి నింపకం, వాటి పటిష్ఠత, తేమ శాతం, భూగర్భ జలాల ఊటను గుర్తించే పరికరాల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

పీపీఏ సీఈఓ సంజీవ్‌ వోహ్రాతో పాటు సభ్య కార్యదర్శి ఎం. రఘురామ్‌, చీఫ్‌ ఇంజినీర్‌ ఎం. రమేష్‌కుమార్‌, పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ పి. రామచంద్రరావు, నాణ్యత విభాగం ఎస్‌ఈ నరసింహరాజు, ఈఈలు డి. శ్రీనివాస్‌, బాలకృష్ణమూర్తి, ప్రేమ్‌చంద్‌, డీఈలు నిర్మల, శ్రీకాంత్‌, విజయ్‌, మల్లికార్జున, పటేల్‌ ఈ పర్యటనలో పాల్గొన్నారు. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) తరఫున పోలవరం ప్రాజెక్టు జనరల్‌ మేనేజర్‌ ఏ. గంగాధర్‌కుమార్‌, డీజీఎంలు గుట్టపాటి శంకరయ్య, మురళి పమ్మి పాల్గొన్నారు.

ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో సుమారు కిలోమీటరున్నర మేర కాలినడకన తిరుగుతూ వివిధ దశల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. మట్టి, రాయి, ఇసుక తదితర నిర్మాణ సామగ్రిని ఏ విధంగా నింపుతున్నారు? వాటిని నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సర్దుబాటు చేస్తున్నారా? అనే అంశాలను అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ నాణ్యతను ప్రత్యక్షంగా నిర్ధారించు కునేందుకు కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే మట్టి, రాయి, ఇసుకతో నింపిన ప్రాంతాల్లో జేసీబీ సాయంతో సుమారు ఒక మీటరు లోతు వరకు తవ్వించి లోపలి పొరల గట్టిదనాన్ని పరిశీలించారు. అనంతరం తొలగించిన మట్టిని తిరిగి అదే ప్రాంతంలో నింపి షీప్‌ఫుట్‌ రోలర్‌తో చదును చేయించారు. గతంలో ఉన్న పటిష్ఠతకు, తిరిగి నింపిన తర్వాత ఏర్పడిన గట్టిదనానికి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందా అనే అంశాన్ని పరిశీలించారు. పరీక్షల్లో గట్టిదనంలో ఎలాంటి తేడా కనిపించకపోవడంతో సీఈఓ సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణంలో మట్టి, రాయిని నింపే విధానాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పొరల మధ్య ఎక్కడా ఖాళీలు మిగలకుండా, నిర్దేశిత పద్ధతిలో మట్టి, రాయితో పటిష్ఠంగా నింపాలని అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు. నిర్మాణంలోని ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ సమయంలో భూగర్భం నుంచి వచ్చే నీటి ఊట, మట్టిలో తేమ శాతాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు దిగువ భాగంలో ఏర్పాటు చేసిన పరికరాల పనితీరును కూడా పీపీఏ సీఈఓ తనిఖీ చేశారు. ఈ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా? వాటి ద్వారా అవసరమైన సమాచారం అందుతోందా? అనే విషయాలను సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరికరాల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!