14 ఏళ్లుగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నా : రేణు దేశాయ్

సోషల్ మీడియా ట్రోలింగ్‌పై రేణు దేశాయ్ ప్రశ్నలు

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టి, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ భార్యగా మాత్రమే తనను గుర్తించడంపై అసహనం వ్యక్తం చేశారు. వీరిద్దరూ విడిపోయి 14 ఏళ్లు దాటినప్పటికీ, తన వ్యక్తిగత విజయాలను గుర్తించకుండా, ఇప్పటికీ తనను పాత బంధంతోనే ముడిపెట్టి చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, తాను ఎదుర్కొంటున్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ విడాకుల తర్వాత తన ప్రయాణం గురించి రేణు మాట్లాడారు. ‘బద్రి’ సినిమా ద్వారా రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే, చాలామంది ఆమె జీవితం, కెరీర్ ఆ సినిమాతోనే మొదలయ్యాయని భావిస్తారని, ఆ సినిమాకు ముందు, ఆ తర్వాత త‌ను సాధించిన విజయాలను ఎవరూ పట్టించుకోరని పేర్కొన్నారు.

ఈ అంశంపై స్పందిస్తూ ఇన్ని ఏళ్లు గడిచినా ఇప్పటికీ తనను ‘పవన్ కళ్యాణ్ మాజీ భార్య’గానే పిలుస్తున్నారని రేణు అన్నారు. తన పరిస్థితిని శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసంతో పోల్చిన ఆమె, తన కష్టకాలం ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నించారు. 2012లో విడిపోయిన తర్వాత కూడా తాను పని చేయడం ఆపలేదని రేణు దేశాయ్ తెలిపారు. వినోద పరిశ్రమలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ తన కెరీర్‌ను నిర్మించుకుంటూ వచ్చాన‌న్నారు. విడాకుల తర్వాత, ఆమె ఒక మరాఠీ చిత్రాన్ని నిర్మించగా, అది ఘనవిజయం సాధించింది. మరో సినిమాకు కథ రాయడమే కాకుండా, దానికి నిర్మాతగా వ్యవహరించి, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు.

సినిమాలతో పాటు, డ్యాన్స్ షోలలో పాల్గొనడం, కవిత్వం రాయడం వంటి అంశాలపై కూడా ఆమె దృష్టి సారించారు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. తన వృత్తిపరమైన విజయాలను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించిన రేణు, తనకు సొంత గుర్తింపు, ప్రతిభ లేకపోతే ఇన్ని అవకాశాలు ఎలా లభించేవని అన్నారు. సోషల్ మీడియాలో తనకు ఎదురయ్యే ప్రతికూల వ్యాఖ్యల గురించి కూడా ఆమె మాట్లాడారు. జంతువులకు సహాయం చేసేందుకు తాను చేసే ప్రయత్నాలను కూడా కొందరు విమర్శలకు, ట్రోలింగ్‌కు వాడుకుంటున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!