సీనియ‌ర్ సిటిజ‌న్లకు ఆలోచ‌న మూవీ ఫ్రీ

బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

హైద‌రాబాద్ : టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ నటులు నారాయణ రావు, నరసింహ రాజు, ప్రసాద్ బాబు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత ప్రధాన పాత్రల్లో రూపొందిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఆలోచన’. బెన్నీ సుధాకర్ నూతన పరిచయంతో రాబోతున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా బిఏ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ U/A సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ నవంబర్ 27న ఎస్కే పిక్చర్స్ ద్వారా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు మేకర్స్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు అంటే నవంబర్ 27, 28, 29 తేదీలలో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు థియేటర్లలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

కేవలం తమ ఆధార్ కార్డును చూపించి సీనియర్ సిటిజన్లు ఈ సినిమాను ఉచితంగా వీక్షించే అవకాశాన్ని చిత్ర బృందం కల్పించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్తూ చిత్ర బృందం ప్రీమియర్ షోతో పాటు గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధం చేసింది. మంగళవారం సాయంత్రం 4:30 గంటల నుంచి హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ స్క్రీన్ నంబర్-1 వేదికగా ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. సీనియర్ నటుల కలయికలో వస్తున్న ఈ చిత్రం ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకోగా, వియాన్ సంగీతం అందించారు. మనసును హత్తుకునే కథాంశంతో వస్తున్న ‘ఆలోచన’ చిత్రానికి టి. సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా, ఆర్.ఎల్. వర్మ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. సీనియర్ నటుల అనుభవం, సామాజిక సందేశం కలగలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలంటే నవంబర్ 27 వరకు వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your Email Id will not be published!