తిరువనంతపురం : మలయాళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు శ్రీజిత్ రవికి కోలుకోలేని షాక్ ఇచ్చింది కోర్టు. ఒక బాధ్యత కలిగిన నటుడిగా వ్యవహరించాల్సింది పోయి అనుచిత ప్రవర్తనకు పాల్పడడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేసింది కోర్టు.
ప్రజా సమక్షంలో ఇద్దరు మైనర్ బాలికల ముందు తన జననేంద్రియాలను ప్రదర్శించడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి తనపై కేసు నమోదైంది. విచారణ చేపట్టిన కోర్టు మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. భార్య, పిల్లలు ఉన్న వ్యక్తి, అమాయకులైన మైనర్ బాలికల పట్ల ఇంతటి అసహ్యకరమైన ప్రవర్తనకు ఎలా పాల్పడగలడు? అంటూ నిప్పులు చెరిగింది ధర్మాసనం. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం 9 , 14 ఏళ్ల వయస్సు గల ఇద్దరు బాలికలు ఈ స్వయంగా వెల్లడించారు. ఒక నల్లని కారులో వచ్చిన వ్యక్తి తమ ముందు అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశారు.
ఆ వ్యక్తిని బాలికలు గుర్తించగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ,వాహనానికి సంబంధించిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన 2022 జూలై 4న కేరళలోని త్రిసూర్ ప్రాంతంలో ఉన్న ఎస్.ఎన్. పార్క్ సమీపంలో జరిగింది. దర్యాప్తు , విచారణ అనంతరం కోర్టు 21 మంది సాక్షులను విచారించి తీర్పును వెలువరించింది. శ్రీజిత్ రవిని దోషిగా తేల్చింది కోర్టు, అతనికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు ₹50,000 జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని బాధితులైన ఆ ఇద్దరు బాలికలకు అంద జేయాలని ఆదేశించింది. ఈ ఘటన 2022లో జరిగితే తీర్పు రావడానికి 2026 వరకు సమయం పట్టింది. మైనర్ బాలికలకు సంబంధించిన కేసులో న్యాయం కోసం నాలుగేళ్లు వేచి చూడాల్సి రావడం ఎంత దారుణం కదూ. అమాయక పిల్లలు న్యాయం కోసం ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిన సమాజంలో మనం జీవిస్తున్నామా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీ హోదా, ప్రజాదరణ లేదా పలుకుబడి ఏవీ కూడా ఎవరినీ బాధ్యత నుండి తప్పించ కూడదని పేర్కొంటున్నారు.
