575 టీఎంసీల కృష్ణా జ‌లాల కోసం పోరాడుతున్నాం

ప్ర‌భుత్వ చిత్త‌శుద్దిని శంకించాల్సిన అవ‌స‌రం లేదు

హైద‌రాబాద్ : కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాను సాధించే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం తన బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ నెర వేరుస్తుందని ఆయన పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల నీటిని కేటాయించిందని గుర్తు చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో 71 శాతం తెలంగాణలోనే ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణకు దక్కాల్సిన 575 టీఎంసీల కృష్ణా జలాల కోసం పోరాడుతున్నామని తెలిపారు.ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డి భోది పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన పరిణామాలు, వాస్తవాలు , ‘పల్నాడు వాటర్ గ్రిడ్’ ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటిని తరలిస్తోందనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ విషయాలను వివరించారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు , కేంద్ర జలశక్తి శాఖ , కేంద్ర మంత్రుల‌పై ఒత్తిడి తీసుకు రావడమే కాకుండా సుప్రీంకోర్టులో కూడా తాము పోరాడుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.

అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఇప్పటికే నివేదిక సమర్పించామని, ప్రధానమంత్రిని కూడా పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ హక్కులను కాపాడేందుకు, అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. నీటి పారుదల రంగ నిపుణులు , న్యాయ నిపుణుల సలహాలతో స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. పెండింగ్‌లో ఉన్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆరు నుండి ఎనిమిది నెలల్లోపు వెలువడేలా చూడటానికి నిరంతరం సమీక్షలు జరుపుతూ, అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను తాకట్టు పెట్టిందని, రాష్ట్ర హక్కులను కాపాడటంలో విఫలమైందని కొంతకాలంగా వస్తున్న రాజకీయ ఆరోపణలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఖండించారు. కృష్ణా నదీ జలాలకు సంబంధించి వాస్తవాలను కాకుండా, అబద్ధాలు , తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తమ నీటిని లాగేసుకుంటోందనే అపోహలు లేదా అనుమానాలను సృష్టించ వద్దని ఆయన ప్రజలను కోరారు. ఎవరైనా ఇలాంటి విషయాలపై తప్పుడు వాదనలు చేసినప్పుడు, అందుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించాలని సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!