విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పిన పార్టీ హైకమాండ్ తన మాటను తప్పింది. ఊహించని షాక్ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రం నుండి సీటు ఇస్తామని చెప్పి ఇవ్వక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజ్యసభ సీటు మాట ఇచ్చిన వాళ్లకు మాత్రమే అంటూ పేర్కొనడం కలకలం రేపింది. మధ్యలో మీ అసహనం ఏంటి ? ఈ అతి స్పందన ఎందుకు ? అని ప్రశ్నించారు షర్మిలా రెడ్డి. 12 ఏళ్ల వైఫల్యాలను ప్రజల ముందు పెడితే, సమాధానం చెప్పే దమ్ములేక అర్థం పర్ధం లేని అంశాలను మాట్లాడే మీ సంస్కారం ఏపాటిదో అర్థమైంది అంటూ బీజేపీని ఉద్దేశించి నిప్పులు చెరిగారు. ప్రజా ఉద్యమ గొంతుకగా ఎవరిది ఆరాటమో, ఎవరిది అసహనమో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అంకితభావం మాది. సహనాన్ని కోల్పోయి పిచ్చిప్రేలాపనలు మీవి అంటూ ఎద్దేవా చేశారు.
నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పుండుమీద కారం చల్లే చేష్టలు బంద్ పెట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన లేవనెత్తిన 12 వైఫల్యాల మీద సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్. మీద మెరుగులు చూపించడం ఆపి లోపల పురుగుల సంగతి తేల్చాలన్నారు. రైళ్లు,రహదారులు అని చెప్పడం కాదు. నిత్యావసర ధరలు 300 శాతం ఎందుకు పెరిగాయో చర్చకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
జి 20 తో ఉద్ధరించారని కాదు .. AI సమ్మిట్ల ద్వారా చైనా కుక్కబొమ్మతో దేశ పరువు ప్రపంచ వేదికగా ఎందుకు తీశారో చెప్పాలన్నారు. అతి పెద్ద స్టార్టప్ అని చెప్పుకోవడం కాదు.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేక పోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిలా రెడ్డి. DBT లు కాదు.. 28 సార్లు జరిగిన పేపర్ లీకులు గురించి చెప్పాలన్నారు. సాధికారిత అని సమర్ధించు కోవడం కాదు.. నడిరోడ్లపై మహిళలను నగ్నంగా ఊరేగించి, ఏటా జరుగుతున్న 5 లక్షల అఘాయిత్యాల మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీకి లేదా అని ప్రశ్నించారు.
మౌలిక వసతులు కల్పన అని కాదు .. తెచ్చిన లక్షల కోట్ల అప్పులు ఎక్కడ ఖర్చు చేశారో శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశీయ ఆర్ధికవృద్ధి మెరుగ్గా ఉంటే డాలర్ ఎదుట రూపాయి విలువ రెండింతలు ఎందుకు పతనం అయ్యిందో దేశానికి చెప్పాలన్నారు షర్మిలా రెడ్డి. PM కిసాన్ నిధులతో రైతులను ఆదుకుంటే ఏటా 12 వేల మంది రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించచారు. “విభజన రాజకీయాల గురించి బీజేపీ మాట్లాడితే దెయ్యాలు వేదాలు చెప్పినట్లే ఉంది”. సర్వమత సమ్మేళనం ఎవరి సిద్ధాంతమో, మతాల మధ్య చిచ్చు పెట్టి, విభజన రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేది ఎవరో దేశం మొత్తం ఎరుకేనని అన్నారు.
