న్యూఢిల్లీ : అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు బొద్దింకల జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దిప్కే. తన రాక సందర్బంగా భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. శనివారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన నిరసనలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మద్దతుదారులు భారీ ఎత్తున చేరుకున్నారు. నీట్ పేపర్ లీక్ ఉదంతంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్ వేదిక పిలుపు ఇచ్చింది సీజేపీ. ఈ సందర్బంగా ఈ నిరసన కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించింది. ఈ నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించేందుకు అంతకు ముందు ‘బొద్దింక జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అమెరికా నుంచి భారీ సెక్యూరిటీ మధ్యన దేశ రాజధానిలో కాలు మోపారు. ఢిల్లీ పోలీసు అధికారులు విమానాశ్రయంలో ఆయనను కలిశారు. నిరసన ప్రదర్శన కోసం జంతర్ మంతర్‌కు వెళ్లేందుకు అనుమతించారు.
నిరసన ప్రదర్శనకు అనుమతి కోరేందుకు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవాలని దీప్కే అంతకు ముందు తన మద్దతుదారులను కోరారు. కానీ పోలీసులు నిరసన ప్రదర్శనకు అనుమతించిన తర్వాత, ఆయన తన మద్దతుదారులను నేరుగా జంతర్ మంతర్‌కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక సంస్కర్త , రాజ్యాంగ నిర్మాత అయిన బి.ఆర్. అంబేద్కర్ ఆత్మకథ ప్రతిని చేతిలో పట్టుకుని దీప్కే విమానాశ్రయం నుండి బయటకు వస్తూ కనిపించారు. ఇదిలా ఉండగా నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని నిరసన ప్రదేశం, సమీప ప్రాంతాలలో సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు.
నిరసన ప్రదేశంలో పంపిణీ చేసిన ఒక కరపత్రంలో, ‘బొద్దింకల జనతా పార్టీ’ ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశ్యం జవాబుదారీతనం కోరడం, న్యాయం సాధించడం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం” అని పేర్కొంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌కు 8 లక్షలకు పైగా సంతకాలు లభించాయని కూడా ఆ కరపత్రంలో తెలిపారు. మే 16న, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ “పరాన్నజీవులుష , “బొద్దింకలు” అని చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదం నేపథ్యంలో, అభిజీత్ దీప్కే ‘బొద్దింకల జనతా పార్టీ’ అనే ఒక వ్యంగ్య డిజిటల్ సంస్థను ప్రారంభించారు. గంటల వ్యవధిలోనే, ఈ సీజేపీ ఇంటర్నెట్లో సంచలనం సృష్టించి, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లక్షలాది మంది అనుచరులను సంపాదించుకుంది.