Dasarathi Krishnamacharya: దాశరథి
"నా తెలంగాణ కోటి రతనాల వీణ" అంటూ తెలంగాణా విముక్తికోసం ఉద్యమించిన దాశరథి
Dasarathi Krishnamacharya : దాశరథి కృష్ణమాచార్యులు (జూలై 22, 1925 – నవంబర్ 5, 1987): దాశరథి గా పేరు గాంచిన దాశరథి కృష్ణమాచార్య తెలంగాణకు చెందిన కవి, రచయిత. తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి. నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయి పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని గర్వంగా ప్రకటించి తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన చిరస్మరణీయుడు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగం చేసిన దాశరథి అనేక కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు.
Dasarathi Krishnamacharya – నిజాం నిరంకుసత్వానికి వ్యతిరేకంగా గలమెత్తిన దాశరథి
కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ విముక్తి కోసం పాటుపడ్డ దాశరథి(Dasarathi Krishnamacharya) పలు సినిమాలకు గేయరచయితగా కూడా పనిచేశాడు.
ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. నిజాము ప్రభుత్వం అప్పట్లో దాశరథిని నిజామాబాదు లోని ఇందూరు కోటలో మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది. ఖైదుగా ఉన్న సమయంలో పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు.
సాహిత్యం, సినిమా గేయ రచయితగా దాశరథి
దాశరథి రచనల్లో అగ్నిధార, మహాంధ్రోదయం, రుద్రవీణ, అమృతాభిషేకం, ఆలోచనాలోచనాలు, ధ్వజమెత్తిన ప్రజ, ఖబడ్దార్ చైనా ముఖ్యమైనవి. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో దాశరథి ఒకడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇద్దరు మిత్రులు, వాగ్థానం, పూలరంగడు, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి, ఆత్మగౌరవం, దాగుడుమూతలు, శ్రీకృష్ణతులాభారం, మూగనోము, బుద్ధిమంతులు వంటి ఎన్నో హిట్ సినిమాలకు దాశరథి పాటలు అందించారు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసినవారికి తెలంగాణ ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది.
Also Read : Kaleshwaram Project Comment : కాళేశ్వరం ఆందోళనకరం