హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, ప్రత్యేక పూజలు చేపట్టి ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. 18 గణాలను , ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్షణం. కంకణబట్టార్ గా శ్రీ పి.కృష్ణసాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
ఉత్సవాలలలో భాగంగా ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనంపై స్వామి వారు ఊరేగారు. బుధవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై దర్శనం ఇచ్చారు. 19న గురువారం ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 20న శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వ భూపాల వాహనం, 21న ఉదయం పల్లకీ ఉత్వసం, రాత్రి గరుడ వాహనం, 22న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం, 23న ఉదయం సూర్య ప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 24న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం జరగనుంది. 24న ఉదయం చక్ర స్నానం, రాత్రి ధ్వజారోహణం, 26న మధ్యాహ్నం పుష్ప యాగం నిర్వహించనున్నారు.
జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా టిటిడి పటిష్ట చర్యలు చేపట్టింది. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టాలని కోరారు. చలువ పందిళ్లు, క్యూ లైన్లు, తాగునీరు, అన్నప్రసాదాలు, పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేసారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, జూబ్లీహిల్స్ ఎస్వీ ఆలయ ఎల్.ఏ.సి ప్రెసిడెంట్ ఏ. వి. రెడ్డి, ఏఈవో రమేశ్, టెంపుల్ ఇన్పెక్టర్స్ నిరంజన్, హరికృష్ణ, పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
