అమరావతి : బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆసక్తికర , సరదా వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సోమవారం ఏపీని దర్శించారు బిల్ గేట్స్. తనకు గ్రాండ్ వెల్ కం లభించింది. ఈ సందర్బంగా సెక్రటేరీయేట్లోని సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో సమావేశంలో పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు బిల్ గేట్స్. చంద్రబాబు తనకు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని సమావేశంలో సరదాగా వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఇన్నోవేషన్స్, వేగవంతమైన నిర్ణయాలు, చర్యలు అద్భుతంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. డిజిటల్ విప్లవానికి భారతదేశంలో బలమైన పునాదులు పడ్డాయన్నారు.
భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబు ఇచ్చారు బిల్ గేట్స్. తాను మొదటిసారి సీఎం చంద్రబాబును కలిసినప్పటి విషయాలను సమావేశంలో పంచుకున్నారు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్. ప్రపంచ దేశాల్లో తాను కలిసిన ఎంతో మంది నాయకుల ఆలోచనల కంటే చంద్రబాబు ఆలోచనలు చాలా ముందున్నాయని తొలి భేటీలోనే గ్రహించినట్టు వెల్లడించారు. నాటి సింగపూర్ ప్రధాని కూడా చంద్రబాబు తరహా భిన్నమైన, విజన్‌తో కూడిన ఆలోచనలు చేసేవారని సమావేశంలో వివరించారు. గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే మెజార్టీ ప్రాజెక్టులని వివరించారు.
ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని స్పష్టం చేశారు బిల్ గేట్స్. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని సమావేశంలో మరోసారి కితాబు ఇచ్చారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారికి సరైన రీతిలో… తగిన స్థాయిలో విద్యా బోధన చేయడానికి AI సహయ పడుతుందని స్పష్టం చేశారు.
