తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తి దేవాలయం లో శివరాత్రి నాడు శివ స్వామి భక్తుల పై పోలీసు లు లాఠీచార్జీ అని సోషియల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. సోమవారం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గతంలో నంది వాహనం ఊరేగింపు సమయం లో ఎదురైన అనుభవాలను దృష్టి లో ఉంచుకొని స్వామి వారి వాహనాలను మోసే వారిని ముందుగా గుర్తించి వారికి డ్రెస్ కోడ్ ఇవ్వడం జరింగిందని చెప్పారు. ఈ విషయాన్ని చాలా సార్లు మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియ చేశామన్నారు ఎస్పీ.
కానీ ఈరోజు నంది వాహనం తీసుకొని వస్తున్నప్పుడు కొంత మంది శివ స్వామి మాల దారులు క్రమశిక్షణా రాహిత్యంతో నంది వాహనాన్ని బలవంతంగా తీసుకోనే ప్రయత్నించారని , దీంతో వాహనం ఒక వైపు సొరిగి పోయిందన్నారు. భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కంట్రోల్ చేసినట్లు తెలిపారు సుబ్బారాయుడు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. జిల్లా పోలీస్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్క భక్తునికి తక్కువ సమయంలో దర్శనం చేసుకునే లాగా పటిష్ఠ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కానీ కొంత మంది వాస్తవ విషయాలను ధ్రువీకరించు కోకుండా, జరిగిన విషయాన్ని వక్రీకరించి భక్తులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. వారిపై చట్ట పరమైన చర్య తీసుకోవడం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ.
