ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో నటుడు ప్రకాష్ రాజ్
బెంగళూరు : నీట్ -యుజి 2026 తో పాటు సీబీఎస్ఈ పరీక్షల లీక్ కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తన పదవికి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. బెంగళూరు వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరి ఆందోళనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయా పరీక్షలలో
జరిగిన అవకతవకలపై జవాబుదారీతనం కోరుతూ దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్యమానికి తన గళాన్ని వినిపించారు. కర్ణాటక నలుమూలల నుండి విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్నారు. తమ వాయిస్ ను వినిపించారు. కేంద్ర సర్కార్ పై, మోదీ, షా, ప్రధాన్ ల నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దేశ భవిష్యత్తు యువతపైనే ఉంది. మీలాంటి రక్తం మరిగిన వారంతా గాడి తప్పకూడదన్నారు. మరింత ప్రజా చైతన్యంగా మారాల్సిన అవసరం ఉందన్నారు ప్రకాష్ రాజ్. మీతో కలిసి పాలు పంచుకోవడం మరిచి పోలేనని, ఇది ఒక సగటు భారతీయ పౌరుడిగా తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇప్పుడున్న పరిస్థితులలో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు కావడం ముఖ్యమన్నారు. ఇవాళ అన్ని పార్టీలు ప్రజలను ఎలా మోసం చేయాలనే దానిపై దృష్టి సారించాయని ఆరోపించారు ప్రకాష్ రాజ్. పార్టీని ఏర్పాటు చేసినందుకు అభిజిత్ దిప్కేను అభినందించారు. ఈ మూవ్మెంట్ ఇలాగే ముందుకు సాగాలని కోరారు.
