తిరుమల : వేసవి సెలవులు ముగిస్తుండటంతో పాటు రెండో శనివారం, ఆదివారం తోడవ్వడంతో తిరుమలకు భక్తులు గత మూడు రోజుల నుండి పోటెత్తారు తిరుమల పుణ్య క్షేత్రానికి. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ -1,2, నారాయణగిరి షెడ్లు బయట క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది అన్నది లేకుండా చూస్తున్నారు. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, అన్న ప్రసాదం విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్ర, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్, శ్రీవారి సేవా విభాగం పర్యవేక్షకులు సీపీఆర్వో డాక్టర్ టి.రవి తో పాటు వివిధ కళ్యాణ కట్టలను ఆ విభాగాధిపతి రమాకాంత్, అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. సుబ్బారెడ్డి, భద్రతా విభాగం వీజీవో సురేంద్రలు తమ బృందాలతో క్యూలైన్లలో భక్తులకు తమ తమ విభాగాల అందిస్తున్న సౌకర్యాలను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు.
క్యూలైన్లలో 29 పాయింట్లలో భక్తులకు అన్న ప్రసాద పంపిణీ చేస్తున్నారు. ఒక్కో పాయింట్ దగ్గర నలుగురు మంది శ్రీవారి సేవకులు భక్తులకు అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా 37 పాయింట్లలో తాగునీటి కుళాయిలను ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాటు చేశారు. ఇవి బాట గంగమ్మ వద్ద గల 69వ గేట్ నెంబర్ నుండి నారాయణ గిరి షెడ్ల వద్ద ఉన్న సర్వీస్ లైన్ గేట్ నెంబర్ 1 వరకు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లలో 49 పాయింట్లలో త్రాగునీటి డ్రమ్ములు ఏర్పాటు చేసి ఒక్కో డ్రమ్ము వద్ద ఇద్దరు సేవకులు సేవలు అందిస్తున్నారు. Outside lines వద్ద శాశ్వత మరుగుదొడ్లతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసి, వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. అదేవిధంగా చెత్త పేరుకుపోకుండా నిమిషాల వ్యవధిలో చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది విశేష కృషి చేస్తున్నారు.
టీటీడీ విజిలెన్స్ విభాగం ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని అంచనా వేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భక్తులు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. బాట గంగమ్మ గుడి సర్కిల్ నుండి పాచికాల్వ గంగమ్మ గుడి సర్కిల్ వరకు మరో 29 బ్లాకులను ఏర్పాటు చేయడంతో భక్తులు సౌకర్యవంతంగా, క్రమ పద్ధతిలో క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. ఒక్కో బ్లాకులో 150 మంది భక్తులు వేచి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, అదనపు తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. ఒక్కో బ్లాక్ వద్ద ఒక సెక్యూరిటీ గార్డుతో పాటు ఇద్దరు శ్రీవారి సేవకులు విధులు నిర్వహిస్తున్నారు.
