ఎల్ నినో ప్ర‌భావంపై ముసాయిదా తీర్మానం

కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితుల వల్ల ఏర్పడిన వర్షపాతం లోటు పరిస్థితిపై ముసాయిదా తీర్మానం ప్ర‌వేశ పెట్టారు శాస‌న స‌భ‌లో. నైరుతి రుతుపవనాల కాలంలో ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తీవ్రమైన వర్షపాతం లోటు తలెత్తిందని తెలిపింది స‌ర్కార్. సెప్టెంబర్‌లో రుతుపవనాలు మరింత బలహీన పడుతాయని భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. 2026 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో సాధారణంగా కురవాల్సిన 664.5 మి.మీ. వర్షపాతానికి గాను 536.5 మి.మీ. మాత్రమే నమోదైంది. 20 శాతం లోటు ఏర్పడింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 19 జిల్లాలు వర్షాభావ కేటగిరీలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది.
వర్షపాతం లోటు, వర్షాల మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటంతో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. రాష్ట్రంలో వానాకాలం సాధారణ పంటల సాగు విస్తీర్ణం 139.29 లక్షల ఎకరాలుంటే, కేవలం 88 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. వరి సాగు విస్తీర్ణం దాదాపు 18 శాతం తగ్గింది. పంట మొలకెత్తక పోవటంతో పలుమార్లు విత్తనాలు వేయాల్సి రావటంతో రైతులు, కౌలు రైతులపై పెట్టుబడి భారం ఎక్కువైంది.

2026 సెప్టెంబర్ 15 నాటికి రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో 585 టీఎంసీల సామర్థ్యానికి గాను 241 టీఎంసీల లైవ్ స్టోరేజ్ మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే రోజున 497 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ప్రాజెక్టుల్లో నీటి మట్టం తగ్గటంతో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు రిజర్వు చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడున్న నీటి నిల్వలు యాసంగి పంటలకు సాగునీటిని అందించేందుకు సరిపోవు. భూగర్భ జలాలు తగ్గటం, చెరువులు, కుంటల్లో ఆశించిన నీటి లభ్యత లేనందున తాగునీటి కొరత తలెత్తే అవకాశముంది. వర్షాభావ పరిస్థితులు రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ఉపాధి, పశుసంపద, పశుగ్రాసం లభ్యతపై ప్రభావం చూపుతున్నాయి. సాగునీరు, తాగునీటి సరఫరాకు భూగర్భ జలాలు, విద్యుత్తుపై ఆధారపడే పరిస్థితి పెరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితిని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించింది. తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగుకు అవసరమైన విద్యుత్తు సరఫరాకు అవసరమైన ఉపశమన చర్యలు చేపడుతోంది. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందించాల్సిన అవసరముందని శాస‌న స‌భ ఏక‌గ్రీవంగా కోరింది.

Leave A Reply

Your Email Id will not be published!