హైదరాబాద్ : ఎక్కడ కూల్చివేతలు జరిగినా తామే చేసినట్టు చూపించి దుష్ప్రచారం చేయడాన్ని హైడ్రా తీవ్రంగా ఖండించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్రతినిధులు గుర్తించాలని హైడ్రా కోరింది. అవగాహన లేకుండా సోషల్ మీడియా ప్రసారం చేస్తున్న వార్తలు, వీడియోలను.. కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్న వారు హైడ్రాపై దుష్ప్రాచారానికి వాడుతున్నారని మండిపడింది. పద్ధతి ప్రకారం హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. నగరంలో ఫుట్ పాత్ల ఆక్రమణలను హైడ్రా తొలగించడం లేదని స్పష్ం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నగరంలో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపును మూడు మున్సిపల్ (జీహెచ్ ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) కార్పొరేషన్లు పెద్ద యెత్తున చేపట్టాయని తెలిపింది.
ఈ క్రమంలోనే పాతబస్తీతో పాటు నగరంలో అనేక ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను ఆయా మున్సిపల్ కార్పొరేషన్లు తొలగిస్తున్నాయని స్పష్టం చేసింది హైడ్రా. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని సూచించింది. హైడ్రా భారీ ఆపరేషన్లు చేస్తుందని, బడాబాబులు, కబ్జాదారుల ఆటకట్టించి వారి ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుందని తెలిపింది. ఇలా వందలు, వేల ఎకరాల ప్రభుత్వ భూముల (ప్రజల ఆస్తిని)ను హైడ్రా కాపాడిందని వెల్లడించింది. చెరువులు, నాలాలు, రహదారులు, పార్కుల ఆక్రమణల తొలగింపును హైడ్రా చేపడుతుందని పేర్కొంది.. రెవెన్యూ అధికారుల అభ్యర్థన మేరకు ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగిస్తుందని తెలిపింది. నగరంలో గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించే పనిలో హైడ్రా నిమగ్నమై ఉందని స్పష్టం చేసింది. వర్షాకాలం వరదల కట్టడి చేయడమే లక్ష్యంగా హైడ్రా పని చేస్తోందని, పర్యావరణ హితమైన నగర నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం అని, ఆ దిశగా హైడ్రా ముందుకు సాగుతుందని తెలిపింది.
