బెంగళూరు : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వేదికగా జరిగిన ది హిందూ కాన్ క్లేవ్ లో ఆయన మాట్లాడారు. పలు అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో రాష్ట్రాన్ని పాలించే అవకాశం వచ్చిన వారు పాలకులుగా భావించారని, దొరలమని ఫీల్ అయ్యారని అన్నారు. కానీ తాను అలా ఫీల్ కాలేదన్నారు. నేను సేవ చేయడానికి వచ్చిన ప్రజా ప్రతినిధిగా భావించానని చెప్పారు. సామాన్యుల సమస్యలు ఏమిటో అర్ధం చేసుకున్నాను. ప్రత్యేకించి యువత, రైతు కూలీలు, మహిళల సమస్యలు తెలుసుకున్నా.. మీరు మీ యువత సమస్య తెలుసు కోకుంటే కష్టం.. 1969 మొదటి దశ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగింది. 2009లోనూ ఉద్యమం అందుకే వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వ రంగంలో 2 లక్షలు ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరించ లేదు. నేను పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో పర్యటించాను. పాదయాత్ర చేశా.. యువత సమస్యను, వాళ్ల ఆవేదనను అర్ధం చేసుకున్నా.
గతంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన గ్రూప్-1 అభ్యర్థులన ఇంటర్వ్యూ చేశాడని ఆరోపించారు. ఇంజినీరు, డాక్టర్, ఇతర నియామకాలు చేసే వ్యక్తి ఓ ఆర్ఎంపీ డాక్టర్నా? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పునరావాస కేంద్రంగా ఉండకూడదని పేర్కొన్నారు సీఎం. అందుకే నేను యూపీఎస్సీ ఛైర్మన్, ఇతర సభ్యులను కలిశా.. వాళ్లతో చర్చించా. యూపీఎస్సీ ఎలా పని చేస్తుందో తెలుసకున్నాం. ఎటువంటి వివాదాలు లేకుండా నియామక ప్రక్రియ ఎలా చేపడతారో తెలుసుకున్నా.. దాన్ని టీజీపీఎస్సీలో అమలు చేశామన్నారు. 15 నెలల్లో మేం 67,760 ఉద్యోగాలు ఇచ్చాం.. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చాం.. రెండు వారాల క్రితం నోటిఫికేషన్లు ఇచ్చాం… త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం… మా యువత ఇప్పుడు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారని అన్నారు.
గతంలో మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే ఎక్కువ సంఖ్యలో రైతు ఆత్మహత్యలు జరిగేవి.. కారణం అప్పులు.. నేను అధికారంలోకి వచ్చాక 25,035 రైతు కుటుంబాలకు చెందిన రూ.20,616 కోట్ల రుణాలను మాఫీ చేశా.. ఇది దేశంలోనే అత్యధిక రుణమాఫీ.. 2024-25 సంవత్సరంలో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం తెలంగాణ అని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది.. ఎన్సీఆర్బీ కేంద్ర ప్రభుత్వ నివేదిక… రైతులు సంతోషంగా ఉన్నారు.. రైతులు ఇప్పటి వరకు కనీస మద్దతు ధర (ఎమ్మార్పీ) కోసం పోరాడారు.. నేను ఎమ్మార్పీ ఇవ్వడంతో పాటు ధాన్యం రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చాం.. పంట సేకరణను కేంద్రం పట్టించు కోవడం లేదు. ఎమ్మార్పీ ప్రకటించి చేతులు దులుపు కుంటోంది.. పంట ఉత్పత్తుల సేకరణను పట్టించుకోవడం లేదు.. ధాన్యం, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు మేం సేకరిస్తున్నాం.. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నాం.. వాటిని రైతులు ఎరువులు, పెట్టుబడికి ఉపయోగించు కుంటున్నారని తెలిపారు.
