#RakeshTikait : తాక‌త్ ఉన్నోడు తికాయ‌త్

ప‌క్కా మాస్ లీడ‌ర్ తికాయ‌త్

Rakesh Tikait : ఈ దేశంలో ఓ వైపు క‌రోనా వ్యాక్సినేష‌న్ మ‌రో వైపు పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. రెండూ ప్ర‌ధాన‌మే. కానీ ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార‌, సామాజిక మాధ్య‌మాలు మాత్రం ఒక్క‌డి పైనే ఫోక‌స్ పెట్టాయి. అత‌డే రాకేశ్ తికాయ‌త్. ప‌క్కా మాస్ లీడ‌ర్. ల‌క్ష‌లాది మందిని ఒకే చోటుకు చేర్చ‌డంలో దిట్ట‌. భ‌యం అంటే ఏమిటో తెలియ‌ని ధీర‌త్వం ఇత‌డి నైజం. రైతుల కోసం అవ‌స‌ర‌మైతే ప్రాణాలిస్తా కానీ ఉద్య‌మించ‌డం మాత్రం ఆప‌నంటున్న అత‌డి గుండె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేం.

ఓ వైపు దాడులు ఇంకో వైపు కేసులు..మ‌రో వైపు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు అన్నింటిని త‌ట్టుకుని గోడ లాగా నిల‌బ‌డ్డారు. ఒకే రోజులో మాస్ లీడ‌ర్ గా అవ‌త‌రించారనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. ఆయ‌న త‌క్కువ‌గా మాట్లాడ‌తారు. కానీ ఆ మాట‌లు మంట‌లు పుట్టించేలా ఉంటాయి. అడ‌వి బిడ్డ‌ల ఆక్రంద‌న‌లా ఉంటాయి. ఆక్రోశం ఉప్పెన‌లా మారితే ఎలా ఉంటుందో. కెర‌టాలు ఎలా ఉవ్వెత్తున ఎగ‌సి ప‌డ‌తాయో అలా వుంటాయి రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait) మాట‌లు. అంత‌ర్జాతీయంగా పేరొందిన మీడియా సంస్థ‌ల‌న్నీ ఏ అంశాన్నీ ప‌ట్టించు కోవ‌డం లేదు.

ఇంత‌కూ ఈ తికాయ‌త్ ఏం చేస్తున్నాడు. ఏం చేయ‌బోతున్నాడ‌నే దానిపై న‌జ‌ర్ పెట్టాయి. అంటే ఈపాటికే అర్థ‌మై పోయి ఉంటుంది. అత‌డి కోసం దేశాన్ని ప్ర‌భావితం చేసే ప్ర‌ముఖులు, నేత‌లు, జ‌ర్న‌లిస్టులు, మేధావులు, భావ సారూప్య‌త క‌లిగిన వారంతా ఎదురు చూస్తున్నారు. ఆయ‌న‌తో సంభాషిస్తున్నారు. తికాయ‌త్ వెనుక రైతులే కాదు ర‌క్తం మ‌రిగిన, గుండెలు చెదిరిన ఇంకా నూనుగు మీసాలు రాని యువ‌తీ యువ‌కులు ఉన్నారు. పిల్ల‌లు, మ‌హిళ‌లు, వృద్దులు ..ఇలా ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న వెంట ఉన్నారు. అడుగులో అడ‌గు వేస్తున్నారు.

ఢిల్లీ హింసకు కార‌కుడివి నీవేనంటూ పోలీసులు స‌మ‌న్లు జారీ చేస్తే బెద‌ర‌ని నాయ‌కుడు. ముందు దేప్ సిద్దూ ఎవ‌రో ప్ర‌క‌టించండి. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తో విచార‌ణ చేప‌ట్టండి. అస‌లు దోషులెవ‌రో తేలుతుంది. అంతెందుకు మీ ద‌గ్గ‌ర స‌రంజామా ఉంది క‌దా. వెంట‌నే అత‌డి కాల్ డేటా బ‌య‌ట పెట్టండి అంటూ స‌వాల్ విసిరాడు. ఇంకో వైపు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ రైతుల‌ను వెన‌క్కి నెట్టండి అన్న మాట‌తో ద‌మ్ముంటే దా అని పిలిచాడంటే అత‌డికి ఎంత ధైర్యం ఉండాలి.

ఇపుడు రైతుల కోసం న‌డుం బిగించిన తికాయ‌త్(Rakesh Tikait) ఒక‌ప్పుడు ఢిల్లీలో పోలీస్ ఆఫీస‌ర్. యూపీకి చెందిన తికాయ‌త్ తండ్రి మ‌హేంద్ర సింగ్ రైతు పోరాటాల్లో కీల‌క పాత్ర పోషించాడు. మాజీ ప్ర‌ధాని చ‌ర‌ణ్ సింగ్ తో క‌లిసి స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేశాడు. పోలీస్ కాల్పుల్లో రైతులు చ‌నిపోతే..భార‌తీయ కిసాన్ యూనియ‌న్ ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి ఆ త‌ర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు. 1985లో తికాయ‌త్ ఎస్ఐగా ప‌ని చేశాడు. 1990లో తండ్రి నేతృత్వంలో ఎర్ర‌కోట వ‌ద్ద భారీ రైతు ఉద్య‌మం జ‌రిగింది.

తండ్రిని విర‌మించ‌మంటూ రాకేశ్ పై వ‌త్తిడి తెచ్చారు. దీంతో ఖాకీ జాబ్ కు గుడ్ బై చెప్పేశాడు. ఆ నాటి నుంచి నేటి దాకా రైతుల ప‌క్షాన నిలిచాడు. బీకేయూకు ఇపుడు జాతీయ అధికార ప్ర‌తినిధిగా ఉన్నారు. ఎంఏ, ఎల్ఎల్‌బి చ‌దివారు. చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న మ‌హోన్న‌త ఉద్య‌మానికి ఊపిరి పోస్తున్నారు. కేంద్రం వెన‌క్కి త‌గ్గాల‌ని లేక పోతే ప్రాణాలు పోయినా స‌రే అంటున్నారు. ఆపై రైతుల‌పై దాడుల‌ను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు రాకేశ్. ఇలాంటి మాస్ లీడ‌ర్ మ‌న‌కూ ఉంటే బావుండేది క‌దూ. ఎంతైనా రాకేష్ తికాయ‌త్ తాక‌త్ ఉన్నోడు కాదంటారా.

No comment allowed please